శ్రీశైలంతో సహా దిగువ ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తివేత
లక్షన్నర క్యూసెక్కుల నీరు సముద్రం పాలు
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి మళ్ళీ భారీ వరద వస్తోంది. దీంతో శ్రీశైలం దగ్గర నుంచి దిగువనున్న నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీల గేట్లన్నీ ఎత్తివేశారు. శ్రీశైలం ప్రాజెక్టుకు ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి లక్షా 80వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, 1,51,619 క్యూసెక్కులు దిగు వకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 214.36 టీఎంసీలుంది. ఈ ప్రాజెక్టు వద్ద ఇరువైపులా ఏపీ, తెలంగాణా ప్రభుత్వాలు జల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయి. నాగార్జున సాగర్‌కు 1,58,311 క్యూసెక్కుల నీరు వస్తుండగా, ఈ నీటి మొత్తాన్ని ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ డ్యామ్ నీటి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 311.15 టీఎంసీలుంది. ఎగువ నుంచి ఈ ప్రాజెక్టుకు వచ్చే నీటి మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తుండగా, పులిచింతల ప్రాజెక్టు మొత్తం గేట్లు ఎత్తి లక్షా 31వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంతో దిగువకు వదులుతున్న నీరు మొత్తం ప్రకాశం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టు నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 33.62 టీఎంసీలుగా ఉంది. ఇక పులిచింతల దిగువ నున్న ప్రకాశం బ్యారేజీ నీటి సామర్థ్యం కేవలం 3 టీఎంసీలే కావడంతో ఎగువ నుంచి వచ్చే నీటిని మొత్తం దిగువకు వదులుతున్నట్టు జలవనరుల శాఖ అధికారులు వెల్లడిరచారు. కృష్ణా డెల్టాలోని తూర్పు, పశ్చిమ కాలువలకు సుమారు 15వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ, మిగిలిన 1.36 లక్షల క్యూసెక్కుల నీటిని బ్యారేజీలోని 72 గేట్లను ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యారేజీ క్రస్ట్ లెవల్ స్థాయికి మించి నీటి ప్రవాహం ఉన్నట్టు అధికారులు వెల్లడిరచారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా ప్రకాశం బ్యారేజీ నుంచి గత నెల రోజులుగా రోజూ సగటున 30వేల క్యూసెక్కుల వరకూ సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పులిచింతల దిగువన ఉన్న చిన్నపాటి వాగులు, వంకల ద్వారా సుమారు 15వేల క్యూసెక్కుల వరద వస్తున్నట్లు జల వనరుల శాఖాధికారులు చెపుతున్నారు.