తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించాలి
. కేరళ అండగా ఉంటుందని ఎంపీ సంతోశ్ కుమార్ హామీ
. మోదీ ముంపు ప్రాంతాలు పరిశీలించాలి: రామకృష్ణ
. వరద బాధితులకు ధైర్యం చెప్పిన సీపీఐ నేతలు
. చంద్రబాబును కలిసి సహాయ చర్యల వేగవంతానికి వినతి
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి:
కృష్ణానది, బుడమేరు వరద కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలకు ఆపార నష్టాన్ని చేకూర్చినందున, దీనిని కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించి బాధితులను ఆదుకోవాలని సీపీఐ పార్లమెంటు సభ్యులు సంతోశ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు, విజయవాడ నగరంలోని ముంపు ప్రాంతాల్లో శుక్రవారం సీపీఐ బృందం విస్తృతంగా పర్యటించి… బాధితులను ఓదార్చింది. నీట మునిగిన పంట పొలాలను పరిశీలించింది. సహాయ చర్యలు ఏ విధంగా అందుతున్నాయి? బాధితులకు ఈ విపత్తు వల్ల జరిగిన నష్టంపై ఆరా తీసింది. ఇటువంటి సమయాల్లో ధైర్యంగా ఉండాలని, తామంతా అండగా ఉంటామని బాధితులకు ధైర్యం చెప్పింది. సహాయ చర్యలు ముమ్మరంగా చేపట్టేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని భరోసా ఇచ్చింది. గత ఐదు రోజులుగా విజయవాడ నగర ప్రజల ఇళ్లన్నీ వరద ముంపులో మునిగిపోయి… కట్టుబట్టలతో బాధలు పడుతుండటం బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. కేరళ అండగా ఉంటుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎంపీ సంతోశ్ కుమార్ అభయమిచ్చారు. ముంపు పరిస్థితుల్లో ఐదు రోజులైనా మార్పు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, రాజకీయాలకు ఇది సమయం కాదని, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి అన్ని రాజకీయపక్షాలు విలువైన సూచనలిస్తూ, బాధితులకు అండగా నిలబడాలని కోరారు. ఇలాంటి విపత్తు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ముంపు ప్రజలకు మనోధైర్యమిచ్చేలా కృషి చేస్తున్న అధికారులు అభినందనీయులని కొనియాడారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఐదు రోజులుగా వరద ముంపు మండలాలు, ప్రాంతాలు పర్యటించామని, ఆహారం, మంచినీటి కోసం చిన్న సందుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సహాయచర్యలు ప్రతి ఇంటికీ చేరాలని కోరారు. వంద సంవత్సరాల చరిత్రలో ఎన్నడూలేని విధంగా వచ్చిన ఈ ఉపద్రవాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తక్షణమే ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని, బాధితుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలని కోరారు. ఓ పక్క బాధితులు ఐదు రోజులుగా వరద ముంపులోనే ఇబ్బందులు పడుతుండగా, మరోవైపు వరద నీరు కలుషితమై అనారోగ్యాలు ప్రబలే ప్రమాదం నెలకొందన్నారు. అకస్మాత్తుగా వచ్చిన భారీ వరదతో కట్టుబట్టలతో పూర్తిగా నిరాశ్రయులైన బాధితులకు సహాయక చర్యలు మరింత వేగవంతం చేయాలని కోరారు. వరద ఉధృతికి పంట భూములు కూడా పూర్తిగా మునిగిపోయి… రైతులకు అపారనష్టం కలిగిందని, ఒక్క కృష్ణాజిల్లాలోనే లక్షా ఐదు వేల ఎకరాల పంట భూములు ముంపునకు గురయ్యాయని రామకృష్ణ తెలిపారు. ఇప్పటికే వేల కోట్ల పెట్టుబడులు నీటిపాలయ్యాయని, చిన్న వ్యాపారస్తులకు కోలుకోలేని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల బాధలను పరిష్కరించేందుకు రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు బాధితులకు అండగా నిలబడేందుకు కలిసి రావాలని కోరారు.