ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తమిళనాడు అతలకుతలమవుతోంది. వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో..కన్నూర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఏడు కోచ్‌లు పట్టాలు తప్పింది. ఈ ఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.. కొండచరియలు విరిగిపడి ధర్మపురం జిల్లాలోని తొప్పూర్-శివడి స్టేషన్ల మధ్య కన్నూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ రైలు ఏడు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు నైరుతి రైల్వే (ఎస్‌డబ్ల్యూఆర్) తెలిపింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. ఏ ఒక్కరు కూడా గాయపడలేదని, ప్రాణనష్టం సంభవించలేదని నైరుతి రైల్వే అధికారులు స్పష్టంచేశారు. ఈ సంఘటన తర్వాత బెంగళూరు రైల్వే డివిజనల్ సీనియర్ అధికారుల బృందం వైద్యులతో కలిసి ఉదయం 4.45 గంటలకు యాక్సిడెంట్ రిలీఫ్ రైలులో వైద్య పరికరాల వ్యాన్‌తో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది.ప్రయాణికులతోపాటు ఆరు కోచ్‌లను క్లియర్ చేశారు. ప్రయాణికుల సౌకర్యార్థం తొప్పూరులో పదిహేను బస్సులను ఏర్పాటు చేశారు. ఐదు బస్సులను సంఘటన స్థలంలో ఏర్పాటు చేశారు.5 బోగీలపై పెద్ద పెద్ద బండరాళ్లు పడడంతో ట్రైన్ పట్టాలు తప్పింది. ఐదు భోగీలు దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సీనియర్ రైల్వే అధికారులు, ప్రిన్సిపల్ హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సెల్ అధికారులు సహాయ పునరావాస పనులు చేపట్టారు.