దిల్లీ ఘటనపై ‘సుప్రీం’ తీవ్ర ఆగ్రహం
న్యూదిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఓ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా అధికారుల తీరుపై ఆగ్రహం వెలిబుచ్చింది. కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కోచింగ్ సెంటర్లను నియంత్రించడంలో అధికారులు విఫలమయ్యారని మండి పడిరది. ‘ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో దిల్లీకి వచ్చిన విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. నగరంలోని కోచింగ్ సెంటర్లు డెత్ ఛాంబర్‌లు (మృత్యు కుహరాలు)గా మారాయి. వాటిని సక్రమంగా నిర్వహించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఈ ఘటన అందరి కళ్లు తెరిపించింది’ అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇనిస్టిట్యూట్‌లో భద్రతా ప్రమాణాలు అందించే వరకూ ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించుకోవచ్చని సూచించింది. కోచింగ్ సెంటర్లను ఎలాంటి నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారో న్యాయస్థానానికి వివరించాలని కేంద్రం, దిల్లీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కాగా… సెంట్రల్ దిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. నగరంలో విద్యార్థులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారుల తీరును దిల్లీ హైకోర్టు ఇటీవల తీవ్రంగా తప్పుబట్టింది. ఉచితాలను ప్రోత్సహిస్తూ… పన్నులు వసూలు చేయకుండా బహుళ అంతస్తుల నిర్మాణాలకు అనుమతించి డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే ఇలాంటి అనర్థాలకు దారితీస్తుందని పేర్కొంది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.