అంచనాలకందని నష్టం
కట్టుబట్టలతో మిగిలిన బాధితులు
. వరద బీభత్సంపై మూడురోజుల గణన ప్రారంభం
. ఇళ్లకు తిరిగిరాని వారి సంగతేంటి?
. గడువు పెంచితేనే అందరికీ న్యాయం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : భారీ వర్షాలు, వరదలతో ముంపు ప్రాంత ప్రజలు సర్వం కోల్పోయారు. ఈ నష్టం ఎంతనేదీ అంచనాలకు అందడం లేదు. ముంపునకు కారణమైన బుడమేరు మూడు గట్ల పూడ్చివేతను ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసింది. వరద ముంపు బాధితులకు సేవా కార్యక్రమాల్ని యుద్ధప్రాతిపదికన చేపట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నష్టం అంచనాలపైనే అధికార యంత్రాంగం ప్రధాన దృష్టి పెట్టింది. సోమవారం నుంచి ప్రారంభమైన నష్టం గణన ఈనెల 11వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందుకోసం ఒక ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొం దించింది. 1,700 అధికార బృందాలను కేటాయించి నష్టంపై అంచనాలు వేస్తున్నారు. ప్రతి సచివాలయంలో ఒక ఐఏఎస్ అధికారి, జిల్లా స్థాయి అధికారి, స్థానిక ప్రజా ప్రతినిధి పర్యవేక్షిస్తారు. విజయవాడ నగరంలోని 149 వార్డు సచివాలయాల పరిధిలో 2.50లక్షల మంది ఇళ్లకు వెళ్లి నష్టాన్ని లెక్కించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో విజయవాడ రూరల్ మండలంలో మరో ఐదు గ్రామాల్లో కూడా నష్టం లెక్కలు వేస్తారు. ప్రతి వార్డు సచివాలయానికి 10 గణన బృందాలు ఉంటాయి. వారు ఇంటింటి సర్వే నిర్వహించి గృహస్తుల నుంచి అవసరమైన సమాచారం తీసుకుంటారు. ఇందుకోసం ఇప్పటికే 1400 మందికి శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే వర్షాలు, వరదల వల్ల మొత్తం రూ.6,882 కోట్లు నష్టం వాటిల్లినట్లుగా ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసి… నివేదికను కేంద్రానికి పంపారు.
దుస్తులు, గృహోపకరణాలు వరదపాలు
బుడమేరు వరద ప్రభావం ప్రధానంగా విజయవాడ నగరంపైనే చూపింది. పది రోజులపాటు ముంపు నీటిలోనే చాలా కాలనీలు తేలియాడినంత పనైంది. సింగ్‌నగర్, కృష్ణాహోటల్ సెంటర్, వాంబేకాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, పాయకాపురం, ప్రశాంతినగర్, సుందరయ్యనగర్, కండ్రిక,రాజీవ్‌నగర్, జక్కంపూడి కాలనీ, అంబాపురం తదితర ప్రాంత వాసులు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. వారి ఇళ్లు, డాబాలు పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతినడంతో పాటు కట్టుబట్టులతో నిరాశ్రయిలయ్యారు. ఆహారం, మంచినీరు లేక అలమటించిపోయారు. ఇంట్లోని సామాగ్రి నాశనమైంది. దుస్తుల నుంచి గృహాపకరణాలు నీట మునిగిపోయాయి. వంట సామాన్లు, గ్యాస్ స్టౌవ్‌లు నీటితో నిండిపోయాయి. పిల్లల పుస్తకాలు, సర్టిఫికెట్లు వరద నీటిపాలయ్యాయి. దీనికితోడు ద్విచక్ర వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. లేదంటే బురదలో కూరుకుపోయాయి. అవి ఎక్కడున్నాయో వెతుక్కోవాల్సిన పరిస్థితి. కన్పించకుండా ప్రతి మధ్య తరగతి వర్గాలకు చెందిన ఒక్కో ఇంటికి కనీసం లక్ష రూపాయల నుంచి రూ.2లక్షల వరకు ఆర్థికంగా నష్టం చేకూరే అవకాశముంది. అధికారుల అంచనాలో నీట మునిగిన ఇళ్లకు నష్టం ఎంత జరిగిందనేది ఎలా తేలుస్తారనేది అంతుచిక్కడం లేదు.
ఆటో కార్మికులకు కోలుకోలేని దెబ్బ
ఆటో కార్మికులపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. విజయవాడ నగరంలో 6వేల ఆటోలు నడుస్తున్నాయి. అధిక శాతం సింగ్‌నగర్, వాంబేకాలనీ, కండ్రిక పరిసర ప్రాంతాలకు చెందిన డ్రైవర్లున్నారు. వరదలతో ఇళ్లు, రోడ్లు దగ్గర నిలిపిన ఆటోలు రోజుల తరబడి నీట మునిగాయి. వరద ఉధృతితో చాలా ఆటోలు కిలోమీటర్ల కొద్దీ కొట్టుకుపోయాయి. పది రోజుల నుంచి ఆటో కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. అరకొర ఆహారంతోనే వారు జీవిస్తున్నారు. ఆటోలను అద్దెకు తీసుకుని నడుపుతున్న డ్రైవర్లు తీవ్రంగా నష్టపోనున్నారు. చాలా ఆటోలు ఇన్సూరెన్స్ సౌకర్యం లేకుండా ఉన్నాయి. వాటి పరిస్థితేమిటనేదీ అర్థం కావడం లేదు. భవన నిర్మాణ యజమానులకూ నష్టం వాటిల్లింది. నిర్మాణంలో ఉన్న భవనాలు పది రోజులపాటు వరద నీటిలోనే ఉండటంతో పాక్షికంగా దెబ్బతిన్నాయి. వరదలతో చిన్న పరిశ్రమలు చికితిపోయాయి. వరదలతో యంత్రాలు నీట మునిగి దెబ్బతిన్నాయి. సింగ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలపై చాలా మంది ఆధారపడి జీవిస్తుంటారు. దీనివల్ల యజమానులకు ఆర్థికంగా నష్టం రాగా, కూలీల జీవనోపాధికి గండి పడిరది. సింగ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో దుకాణాలు, ఫ్యాన్సీ షాపులు నడుపుకునే వారికీ నష్టం వాటిల్లింది. వారి దుకాణాలను వరద నీట ముంచెత్తడంతో… ఎంత విలువైన సరుకు కోల్పోయారో ఏవిధంగా తేలుస్తారనేది తెలియడం లేదు.
ఇంకా ఇళ్లకు తిరిగిరాని బాధితులు…
తొలుత వరద కొంతమేర తగ్గినప్పటికీ… మళ్లీ వర్షాలు రావడంతో ముంపు బారిన పడతామన్న ఆందోళనతో చాలా మంది కాలనీలు ఖాళీచేసి సమీప బంధువులు, మిత్రుల ఇంటికి మకాం మార్చారు. స్థానికంగా ఉన్నవారు ఒకటిరెండు రోజుల్లో తిరిగొచ్చే అవకాశమున్నప్పటికీ, జిల్లాలు దాటి దూర ప్రాంతాలకు వెళ్లిన వారు ఇంటికి రావడం కష్టంగా మారింది. ఇప్పటికే వరదల నష్ట గణన ప్రారంభిస్తామని, అందరూ అందుబాటులో ఉండాలని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ… రవాణా మార్గం లేక తిరిగి ఇళ్లకు చేరుకోలేక పోతున్నారు. ఇంటి దగ్గర ఉన్న వారే గణనలోకి వచ్చే అవకాశముంది. నష్టం గణన సమయంలో ఇంట్లో ఎవరూ లేనప్పటికీ, తర్వాత నమోదుకు అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ మూడు రోజుల్లోనూ వారు లేకుంటే ఎలా గణిస్తారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఎన్యూమ రేషన్‌లో తమ గృహం, పేరు రాకపోతే స్థానిక ప్రజాప్రతినిధిని కలవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ ఎలా తిరుగుతామని బాధితులు ప్రశ్నిస్తున్నారు. దీంతో నష్ట గణనకు మరింత సమయం పెంచాలని బాధితులు కోరుతున్నారు. ఒక్క ఇంట్లో జరిగిన పూర్తి నష్టాన్ని గణనలో చేర్చి…బాధితులందరికీ నష్ట పరిహారం అందేలా చేయాల్సిన అవసరం ఉంది.