. జలవిలయంతో నేలకూలిన గుడిసెలు
. అల్లూరి జిల్లాలో ఆరు గ్రామాలను తుడిచిపెట్టిన భారీవర్షం
. కట్టుబట్టలతో బతికిబయటపడ్డ ప్రజలు
. భరోసా ఇచ్చి సాయ మందించిన సీపీఐ నేతలు
. కన్నెత్తి చూడని అధికారగణం
విశాలాంధ్ర- జీకే వీధి: గిరిజనులపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ కురిపిస్తున్నట్టుగా గోచరిస్తోంది. వరద వచ్చి సర్వం కోల్పోయి వారం రోజులైనా… నేటి వరకు ఎటువంటి సాయం అందించకపోవడం దానికి అద్దంపడుతోంది. సమాచారం అందుకున్న సీపీఐ నేతలు మేమున్నామంటూ భరోసా ఇచ్చి వారిలో మనోధైర్యాన్ని కల్పించారు. తమకు చేతనైనంత సాయమందించి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే… అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో వారం రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు గిరిజనుల జీవితాలు తలకిందులయ్యాయి. కొండకొనల్లోని గెడ్డలు పొంగిపొర్లడంతో ఆరు గ్రామాల ప్రజలకు కేవలం కట్టుబట్టలే మిగిలాయి. ఒకేసారి పోటెత్తిన వరద వారి గుడిసెల్ని కూకటివేళ్లతో పెకలించి వేయడంతో నిరాశ్రయులుగానే మిగిలారు. రోడ్లు ధ్వంసం కావడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇంత జరిగినా అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. రోడ్డు పునరుద్ధరణ ప్రయత్నం తప్ప బాధితులకు ఏ సాయం అందించలేదు. భారీ వర్షాల ధాటికి దారపురంలో నివసిస్తున్న 21 కుటుంబాల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇళ్లల్లోకి భారీగా వరద నీరు ప్రవహించి తీవ్రనష్టాన్ని మిగిల్చింది. గుమ్మిరేవుల సహా మొత్తం ఆరు గ్రామాలదీ ఇదే పరిస్థితి. విషయం తెలుసుకున్న సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల, సీపీఐ జిల్లా కార్యదర్శి పొట్టిక సత్యనారాయణ తదితరులు ఓ బృందంగా బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. దారపురంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు మూడు క్వింటాళ్ల బియ్యం, మంచి నూనె సహా ఇతర నిత్యావసర సరుకులు అందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం గుమ్మిరేవులలో సర్వం పోగొట్టుకున్న పడాల గురుమూర్తి, మంజుల దంపతులు, ధనార్జున్ తదితరులను ఓదార్చారు. ఇళ్ల నిర్మాణం కోసం రూ.ఐదు వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. గత 50 ఏళ్ల కాలంలో ఇంతటి భారీ వర్షాలను తాము చూడలేదని గిరిజనులు వాపోయారు. ఒక్కసారిగా గెడ్డలు పొంగి వరద నీరు తమ నివాసాల్లోకి చేరడంతో తీవ్రంగా నష్టపోయామని వివరించారు. రోడ్లపైనా మూడు అడుగుల నీరు ప్రవహించినట్టు తెలిపారు. రహదారులు పూర్తిగా దెబ్బ తినడంతో బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని చెప్పారు.
అనంతరం జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ భారీ వర్షాలకు గిరిజనులు సాగు చేసుకుంటున్న వందల ఎకరాల భూమి నామరూపాలు లేకుండా పోయిందని తెలిపారు. ఒక్కసారిగా విరుచుకుపడిన వరద కారణంగా పిల్లా పాపలతో గిరిజనం పడ్డ ఇబ్బందులు వర్ణించలేనివన్నారు. ఇంత జరిగినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని పేర్కొన్నారు. కనీస అవసరాలు తీర్చని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు సీపీఐ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. త్వరలో మరింత సాయం అందిస్తామని పేర్కొన్నారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుంకర విష్ణుమూర్తి, భగవాన్, ఆళ్ల గోవిందు, గోపినాథ్‌్ పాల్గొన్నారు.