. బిక్కుబిక్కుమంటున్న పరీవాహక గ్రామాలు
. ఇళ్లు ఖాళీ చేస్తున్న గొమ్మగూడెం ప్రజలు
. పునరావాస కేంద్రాలకు బాధితులు
. అధికారులు అప్రమత్తం
విశాలాంధ్ర-కుక్కునూరు: నెల రోజులుగా భారీ వర్షాలు, గోదావరి వరదలు ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం ఏజెన్సీ ప్రాంతాల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఏజెన్సీ అంతా తట్టాబుట్టాతో ఇళ్లు ఖాళీ చేయాల్సిందే. ప్రతి ఏడాదీ గోదావరి వరదలతో ముంపు గ్రామాల ప్రజల బాధలు వర్ణనాతీతం. వర్షాకాలం వస్తే చాలు గోదావరి పరీవాహక గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రతి ఏటా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో పలు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. భారీ సంఖ్యలో ఇళ్లు నేలమట్టంవుతున్నాయి. ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం సంభవిస్తుంది. అధికార యంత్రాంగం ముంపు గ్రామాలను అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలకు బాధితులను తరలిస్తున్నారు. అక్కడ అరకొర వసతులతో బాధితులు నెట్టుకొస్తున్నారు. రోడ్లన్నీ బురదమ యంగా ఉండటంతో కాలు మోపాలంటే ఇబ్బంది పడుతున్నా మని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద స్థాయి హెచ్చరిక దాటి గోదావరి పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు అప్రమత్తమై ముంపు దృష్ట్యా తొలుత గొమ్ముగూడెం గ్రామాన్ని ఖాళీ చేయిస్తున్నారు. దాచవరం పునరావాస కేంద్రానికి బాధితులను ట్రాక్టర్లో తరలిస్తున్నారు. వర్షాలు కురుస్తుండటంతో పిల్లా పాపలతో కదిలి రావడానికి నరకయాతన పడుతున్నామని బాధితులు వాపోయారు. ఏటా గోదావరి గండంతో వరద చుట్టుముట్టే తొలి గ్రామం గొమ్ముగూడెం… కాగా ఇప్పటికే గ్రామంలో పోలవరం ప్రాజెక్టు ముంపు కింద కొంతమేర నష్ట పరిహారం కూడా ప్రభుత్వం చెల్లించింది.