పండుగలకు ముందు ప్రజలకు షాక్
న్యూదిల్లీ : అధిక ధరల కారణంగా దేశ ప్రజలు జీవనం సాగించడం కష్టతరంగా మారింది. నిత్యావసర వస్తువుల ధరలు తారస్థాయికి చేరిపోయాయి. పప్పులు, వంట నూనె ధరలు భారీగా పెరగడంతో ప్రజలు పండుగలను సంతోషంగా చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. యావత్ దేశవ్యాప్తంగా పండుగల సందడి మొదలైంది. ఈ నెల 12న విజయదశమి, నెలాఖరులో దీపావళి వేడుకలు జరుగనున్నాయి. ఆ తర్వాత పెళ్లిళ్ల సీజన్ సైతం ప్రారంభం కానున్నది. ఈ పండుగలకు ముందు గోదుమల ధరలు పెరుగుతున్నాయి. గోదుమలపై ప్రభుత్వం నియంత్రణ ఉన్నా పెరుగుతూ వస్తున్నది. ప్రభుత్వం పరోక్షంగా నిల్వలపై పరిమితి విధించింది. వ్యాపారులు ఎప్పటికప్పుడు నిల్వలపై సమాచారం అందించాలని కేంద్రం ఆదేశించింది. ఇదిలాఉండగా, రెండు నెలల్లో గోదుమల ధర క్వింటాల్‌కి రూ.200 పైగా పెరిగింది. దిల్లీ హోల్‌సేల్ మార్కెట్‌లో గోదుమలు క్వింటాల్‌కు రూ.3,100 దాటింది. ఈ పరిస్థితుల్లో గోదుమ పిండితో తయారయ్యే బ్రెడ్, మఫిన్స్, నూడుల్స్, పాస్తా, బిస్కెట్లు, కేకులు, కుకీలు తదితర ఉత్పత్తులపై ధరల ప్రభావం కనిపించే అవకాశం అందని వ్యాపారులు పేర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో గోదుమల ధరలు మరింత పెరుగుతాయని చెబుతున్నారు. మార్కెట్‌లోకి దిగుమతులు రాకపోతే దీపావళి నాటికి క్వింటాల్‌కి రూ.3,500 దాటుతుందని అంచనా. పెళ్లిళ్ల సీజన్‌లో గోదుమల ధర క్వింటాల్‌కు రూ.4 వేలు దాటుతుందని భావిస్తున్నారు. ఎందుకంటే దిగుబడులు వచ్చేందుకు ఇంకా సమయం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఏడాది పొడవునా గోదుమ ధరలను నియంత్రించడానికి, బహిరంగ మార్కెట్ విక్రయం ద్వారా కనీసం 100 లక్షల టన్నుల గోదుమలను మార్కెట్లోకి విడుదల చేయాలి. దేశంలో గోదుమ నిల్వలను పరిశీలిస్తే… ఏప్రిల్ 1 నాటికి దాదాపు 75 లక్షల మెట్రిక్ టన్నుల గోదుమలు ఉన్నాయి.
ఇది బఫర్ స్టాక్ కంటే కొంచెం ఎక్కువ. కాగా, ఈ ఏడాది ప్రభుత్వం 266 లక్షల మెట్రిక్ టన్నుల గోదుమలను కొనుగోలు చేసింది. వీటిని కలిపితే ప్రభుత్వ సేకరణ ముగిసిన తర్వాత ప్రభుత్వం వద్ద 340 లక్షల మెట్రిక్ టన్నుల గోదుమలు నిల్వ ఉన్నాయి. ప్రభుత్వ రేషన్ పంపిణీకి 185 లక్షల మెట్రిక్ టన్నుల గోదుమలు అవసరం ఉంటుంది. ప్రభుత్వం వద్ద 155 లక్షల మెట్రిక్ టన్నుల గోదుమలు అదనంగా నిల్వ ఉన్నట్లు సమాచారం.