. సోలార్, విండ్ పవర్ ద్వారా 7.50 లక్షల మందికి ఉద్యోగాలు
. కర్నూలులో హైకోర్టు బెంచ్
. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు
. సీఎం చంద్రబాబు నాయుడు
విశాలాంధ్ర బ్యూరో- కర్నూలు : రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా మారుస్తామని, సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి ద్వారా 7.50 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయలమాడలో మంగళవారం నిర్వహించిన గ్రామసభలో సీఎం మాట్లాడుతూ… పేదరికం లేని సమాజమే తమ అభిమతమని పేర్కొన్నారు. ఇంట్లో కూర్చుని పని చేసే విధానానికి శ్రీకారం చుడతామని చెప్పారు. దీపావళి నుంచి మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ పంపిణీని ప్రారంభిస్తామని, ఏడాదికి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుచేస్తామన్నారు. మెరుగైన మద్యం పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. రూ.100 కోట్లతో మద్యం మాన్పించే కార్యక్రమం చేపడతామన్నారు. ఓర్వకల్లులో పరిశ్రమలు నిర్మిస్తామని పేర్కొన్నారు. కర్నూలు – బళ్ళారి రహదారిని జాతీయ రహదారి చేస్తామని హామీ ఇచ్చారు. వలంటీర్లను తీసుకునే ఆలోచన చేస్తామని తెలిపారు. డిసెంబరులో డీఎస్సీ నిర్వహించి ఉద్యోగాలు ఇస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.నాలుగు వేలు పింఛన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. ఇప్పటి వరకు రూ.12,508 కోట్ల మేర పింఛన్లు అందజేశామన్నారు. రాష్ట్ర ఖజానాలో పది లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని, లక్ష కోట్లు వడ్డీ కట్టాలని తెలిపారు. సంపద సృష్టించి రాష్ట్రానికి పూర్వ వైభవం తెస్తామన్నారు. గత ప్రభుత్వం పెండిరగ్ పెట్టిన రూ.1,674 కోట్ల ధాన్యం బకాయిలు చెల్లించామని వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తూ చట్టం చేశామని, రాజముద్రతో పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్నామని తెలిపారు. హంద్రీనీవా నుంచి నీళ్లు తరలించి బిందు సేద్యం పొలాలకు సాగునీరిచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలవరం పూర్తి చేసి పెన్నాకు అనుసంధానం చేయగలిగితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోతే నిపుణులను పంపించి గేటు పెట్టించిన పార్టీ టీడీపీ అని అన్నారు. గుండ్రేవుల, ఆర్‌డీఎస్, గురు రాఘవేంద్ర పూర్తి చేసేందుకు ముందుకు వెళ్తామని చెప్పారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా కలెక్టర్లు, ఎమ్మెల్యేల పనితీరు తెలుసుకుని నీతి వంతమైన, సమర్థవంతమైన పాలన అందిస్తామన్నారు. పుచ్చకాయలమాడ గ్రామాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇళ్లు లేని 103 మందికి గృహాలు నిర్మించి ఇస్తామన్నారు. రేషన్ కార్డులు లేని వారికి కార్డులు ఇస్తామన్నారు. 230 మందికి కుళాయిలు, 105 మందికి మరుగుదొడ్లు, ఒకరికి విద్యుత్ కనెక్షన్ వెంట నే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాభివృద్ధికి కలెక్టర్ శ్రద్ధ తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
తొలుత చంద్రబాబు విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుని హెలికాప్టర్ లో పుచ్చకాయలమాడకు చేరుకున్నారు. తలారి గంగమ్మ, వెంకటేష్ ఇళ్లకు వెళ్లి వారికి ఎన్టీఆర్ భరోసా ఫించన్‌లు అందజేశారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మాజీ మంత్రులు కేఈ ప్రభాకర్, గుమ్మనూరు జయరాం, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కలెక్టర్ పీ రంజిత్ బాషా, డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ జీ బిందు మాధవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, ఉపాధ్యక్షుడు సాంబశివారెడ్డి, సర్పంచ్ హారిక, ఎంపీటీసీ చంద్ర పాల్గొన్నారు.