Saturday, November 2, 2024
Saturday, November 2, 2024

చర్చ జరపాల్సిందే..

పెగాసస్‌, రైతుల సమస్యలపైఅట్టుడికిన పార్లమెంటు
ఉభయ సభలు సోమవారానికి వాయిదా
కేంద్ర వైఖరికి విపక్షాల నిరసన

‘పెగాసస్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం.. రైతుల సమస్య’ శుక్ర వారం పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో ప్రతిపక్ష సభ్యులు పెగాసస్‌ స్నూపింగ్‌తోపాటు రైతుల నిరసన వంటి వేర్వేరు అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ నిరసనను కొనసాగించారు. దీంతో వరుసగా నాలుగవ రోజు కూడా రాజ్యసభ, లోక్‌సభ వాయిదా పడ్డాయి.
పెగాసస్‌ గూఢచర్యం వివాదంపై ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఆందోళనకు దిగడంతో రాజ్యసభ కార్యకలాపాలు స్తంభించాయి. ఈ వ్యవహారంపై చర్చ కోసం విపక్ష సభ్యుల ఆందోళనల నడుమ పార్లమెంటు ఎగువ సభ శుక్రవారం నాలుగుసార్లు వాయిదా పడిరది. మూడవ వాయిదా నేపథ్యంలో సభ తిరిగి 2.30 గంటలకు సమావేశమైనప్పుడు ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై చర్చకు డిమాండు చేశారు. ‘జర్నలిస్టులు, హైకోర్టులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, అనేక మంది సీనియర్‌ రాజకీయాలపై ప్రభుత్వం ఆన్‌లైన్‌ నిఘాకు సంబంధించి మీడియాలో ఇటీవల వచ్చిన ఆరోపణలకు సంబంధించి 267 నిబంధన కింద నోటీసు ఇచ్చాను’ అని ఖర్గే తెలిపారు. కాగా సభాధ్యక్ష స్థానంలో ఉన్న భువనేశ్వర్‌ కలిత మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన చేసిందని, ఈ అంశంపై చర్చ ప్రారంభమైందని అన్నారు. ‘దీనిపై ఇప్పటికే ఒక ప్రకటన చేసింది. మీరు ఏదైనా చెప్పవలసి వస్తే అది చర్చలో చెప్పండి. అది మీకు ఇష్టం లేదా’ అని అన్నారు. సభలో ఉప నాయకుడు ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ మాట్లాడుతూ ఇందుకు సంబంధించి కేంద్ర సమాచార సాంకేతిక(ఐటీ) మంత్రి ఇప్పటికే సమాధానం ఇచ్చారని తెలిపారు. ‘ఐటీ మంత్రి ఇప్పటికే సమాధానం ఇచ్చారు. విపక్ష సభ్యులు కొంతమంది సభలో ప్రవర్తిస్తున్న తీరును దేశమంతా చూస్తోంది’ అని అన్నారు. అయితే విపక్ష సభ్యులెవరూ శాంతించకుండా సభలో తమ నిరసనను కొనసాగించారు. దీంతో కలిత సభను సోమవారానికి వాయిదా వేశారు. కాగా వర్షాకాల సమావేశాల వరకు సస్పెన్షన్‌కు గురైన తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యుడు శంతను సేన్‌ సభకు హాజరవడంతో ఆయన్ను సభ నుంచి వెళ్లాల్సిందిగా అధ్యక్షుడు కోరుతూ రాజ్యసభను మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా వేశారు. గురువారం సభలో పెగాసస్‌ స్నూపింగ్‌పై ఐటీ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తన ప్రకటనను కొనసాగిస్తుండగా ఆయన చేతిలో నుంచి పేపర్లు లాక్కుని విసేరిసిన తర్వాత తొలుత ఉదయం సభ సమావేశం కాగానే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ సేన్‌ సస్పెన్షన్‌కు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇది మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. తిరిగి సభ 12.30 గంటలకు సమావేశమైనప్పుడు, సభ నుంచి సేన్‌ బయటకు వెళ్లాలని డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ కోరారు. కానీ టీఎంసీ సభ్యుడు సభలోనే ఉన్నారు. ఇదే సమయంలో ఖార్గేతో సహా అనేక మంది ప్రతిపక్ష ఎంపీలు అనేక అంశాలను లేవనెత్తగా, డిప్యూటీ చైర్మన్‌ సభను 2.30 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పుడు, సభలో సస్పెండ్‌ అయిన సభ్యుడు కొనసాగడంతో రాజ్యసభలో ఎటువంటి కార్యకలాపాలు జరగలేదు. కాంగ్రెస్‌, ఇతర ప్రతిపక్ష సభ్యులు పెగాసస్‌ వ్యవహారంపై చర్చకు డిమాండు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img