. 2029 నాటికి స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యం
. శుభకార్యం రోజున ఓ మొక్క నాటండి
. 2025 డిసెంబర్‌కల్లా బందరు పోర్టు నిర్మిస్తాం
. దీపావళి నుంచి మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ
. మచిలీపట్నం వైద్య కళాశాలకు పింగళి వెంకయ్య పేరు
. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : చెత్తపై గత ప్రభుత్వం వేసిన పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం మచిలీపట్నంలో సీఎం పర్యటించారు. విద్యార్థులతో కలిసి చెత్త ఊడ్చారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో కూర్చుని స్వయంగా తేనీటిని అందించి కాసేపు ముచ్చటించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సమైక్యరాష్ట్రంలో 1998లో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించామని, ఇది తన మనసుకు దగ్గరగా ఉంటుందన్నారు. 2015లో మన రాష్ట్రంలో స్వచ్ఛ ఏపీకి శ్రీకారం చుట్టాం. 2019కి ముందు పట్టణాల్లో డివైడర్లకు రంగులు వేసి, పార్కులు అభివృద్ధి చేశాం. కానీ 2019లో భూతం వచ్చి వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు. గత పాలకుల నిర్వాకం కారణంగా రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త కుప్పలుగా ఉంది. 365 రోజుల్లో ఆ చెత్తంతా తొలగించాలని మంత్రి నారాయణను ఆదేశిస్తున్నా. చెత్తపై పన్ను వేశారు తప్ప…చెత్త తొలగించలేదు. ఇకపై ప్రతి రోజూ విధిగా చెత్త తొలగిస్తాం. టెక్నాలజీ ఉపయోగించి భవిష్యత్తులో ఎక్కడా చెత్త లేకుండా చేస్తామని చెప్పారు.
మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు
‘జాతీయోద్యమంలో మహాత్మాగాంధీ దేశమంతా కదిలించారు… అహింస పద్ధతిలో పోరాడారు. ఆయన సిద్ధాంతాలు భావితరాలకు ఆదర్శం. గాంధీ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నామంటే అందుకు కారణం ప్రజాహితమైన ఆయన ఆలోచనలే. 1919లో గాంధీజీ మొదటిసారి కృష్ణా జిల్లాలో నిర్వహించిన సత్యాగ్రహ సభలో పాల్గొన్నారు. 1921లో అఖిల భారత మహాసభల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఈ గడ్డపై పుట్టిన పింగళి వెంకయ్య తాను రూపొందించిన జాతీయ జెండాను గాంధీజీకి అందించారు. స్వాతంత్య్ర ఉద్యమం, పోరాటంలో పింగళి వెంకయ్య ముందుండి పోరాడారు. ప్రతి భారతీయుడు సగర్వంగా చెప్పుకునే శక్తి ఇచ్చిన పింగళి వెంకయ్య ఈ గడ్డపై పుట్టిన వ్యక్తి కావడం మనందరికీ గర్వకారణం. స్వాతంత్య్ర పోరాటానికి ఊతమిచ్చిన ప్రాంతమిది. ఆంధ్ర జాతీయ కళాశాలలో ఎందరో మహానుభావులు విద్యనభ్యసించారు. కానీ కొందరు స్వార్థపరులు ఆ కాలేజీని కబ్జా చేయాలని చూశారు. మహనీయుల స్ఫూర్తిని కాపాడతాం. ఆంధ్ర జాతీయ కళాశాలను ప్రభుత్వ అధీనంలో నిర్వహిస్తాం. ఇక్కడి మెడికల్ కాలేజీకి పింగళి వెంకయ్య పేరు పేరు పెడతామని చెప్పారు.
దీపావళి నుంచి
మూడు సిలెండర్లు ఉచితం
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుండి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. నా చిన్నతనంలో మా తల్లి వంటగదిలో పడిన కష్టాలు చూశాను. నా తల్లి పడిన కష్టం ఏ ఆడబిడ్డ పడకూడదని ఆలోచించి దీపం పథకం ద్వారా ఉచిత గ్యాస్ పథకానికి గతంలో శ్రీకారం చుట్టాను. ఇప్పుడు పెరిగిన ధరల దృష్ట్ల్యా పేదలకు మూడు సిలెండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. 2027 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత మంచి నీళ్లిస్తాం. జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత ప్రభుత్వం వినియోగించలేదు. మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నీరందే లక్ష్యంతో ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించాం. 2025 నాటికి ప్రతి గ్రామంలో ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. 2029 నాటికి అవసరమైన చోటల్లా వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తాం. పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం. ప్రతి ఒక్కరూ మీ పుట్టిన రోజు నాడు లేదా శుభకార్యం రోజున ఒక చెట్టు నాటండి. చెట్టు నాటడం మన నాగరికత. రెండేళ్లలో పోలవరం పూర్తి చేసి, అమరావతి రాజధానిని కూడా నిర్మిస్తామని సీఎం చెప్పారు.
2025 నాటికి బందరు
పోర్టు నిర్మాణం పూర్తి
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిర్మాణ పనులు నిల్చిపోయిన బందరు పోర్టును 2025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. బందరు పోర్టు పూర్తైతే ఇక్కడి వాసులకు అనేక లాభాలు కలుగుతాయి. బందరు నుండి రేపల్లెకు రైల్వే లైను ఏర్పాటుకు చొరవ తీసుకుంటాం. మచిలీపట్నంలో డ్రెయినేజీ 100 శాతం మంచిగా ఉండేలా చేస్తాం. మచిలీపట్నం బీచ్‌ను స్వదేశీ దర్శనం పథకం కింద అభివృద్ధి చేస్తాం. మత్య్సకారులకు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తాం. బందరు లడ్డు, రోల్డ్ గోల్డ్ నగల తయారీ పరిశ్రమను అభివృద్ధి చేస్తాం. ఈ రెండిరటి కోసం ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ క్లస్టర్ ఏర్పాటు చేస్తాం. కళంకారీ వస్త్ర పరిశ్రమకు న్యాయం చేస్తాం. 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, పి.నారాయణ, కొలుసు పార్థసారధి, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.