విషాదాన్ని మిగిల్చిన వరద
విశాలాంధ్ర-డిజిటల్: ఉరుములా, మెరుపులా, ఎగసిపడిన సముద్రపు కెరటాల వలే… కన్నుమూసి తెరిచేలోగా మేనువులా విరుచుకుపడిన వరద అలలకు వేలాది కుటుంబాలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. తేరుకునేలోపే ఇళ్లను వరదనీరు ముంచెత్తింది. చెట్టుకొకరు పుట్టకొకరు చెల్లాచెదురయ్యారు. ప్రాణాలు రక్షించుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు వెళ్తూ ఒక్క విజయవాడ నగర, రూరల్ పరిధిలో సుమారు 40 మంది అసువులుబాశారు. భారీ వర్షాలు, వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా 55 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా. లెక్కకందని మరెందరో జాడ తెలియలేదు. అంతుచిక్కని వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఒక్క ఎన్టీఆర్ జిల్లాలో సుమారు 2.76 లక్షల మంది వరదబారిన పడినట్టు అంచనా. 46,320 నిర్వాసితులకు 226 పునరావాస శిబిరాల్లో ఆశ్రయం పొందారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,44,536 మంది నష్టపోయారని ప్రభుత్వ అంచనా. వరద ఉగ్రరూపాన్ని అడ్డుకుని ఆదుకునే దిక్కులేక కొందరు ఇళ్లల్లోనే తనువు చాలించారు. పదుల సంఖ్యలో మృతదేహాలు వరదలో కొట్టుకురావడం, ఇళ్ల గోడలపై వేలాడుతున్న దృశ్యాలు భయకంపితులను చేశాయి. ఎందరో మృతకళేబరాలను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. తమవారి జాడ దొరుకుతుందే మోనన్న ఆశతో కుటుంబ సభ్యులు వెదుకు లాట ప్రారంభించారు. కుళ్లిన మృతదేహాలను చూస్తూ కన్నీరుమున్నీర య్యారు. 22 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించినట్టు విశ్వసనీయ సమాచారం. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం తదితర జిల్లాల్లో లక్షలాది మంది భారీ వర్షాలు, వరదల బారినపడినట్టు వార్తాకథనాలు. 20 జిల్లాల్లో 2,05,194 మంది రైతులు నష్టపో యారు. 12 జిల్లాల్లో 19,686 హెక్టార్లలో ఉద్యానపంటలు దెబ్బతిన్నాయి.ఎన్టీఆర్ జిల్లాలో బుడమేరు పెనుముప్పు విషాదాన్ని మిగిల్చింది. విజయ వాడ నగరంలోని సింగ్‌నగర్, వాంబేకాలనీ, శాంతినగర్, ఇందిరానాయక్‌నగర్, పసుపుతోట, ఆంధ్రప్రభ కాలనీ, కండ్రిక, రాజీవ్‌నగర్, ప్రకాశ్‌నగర్, ఎల్బీనగర్, భవానిపురం, విద్యాధరపురం, రూరల్ మండలం అంబాపురంలో వేలాది కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. ముంచుకొ చ్చిన ముప్పుతో ముప్పుతిప్పలు పడ్డారు. పసి బిడ్డలు పాలులేక అల్లాడిపోయారు. లక్షకు పైగా ద్విచక్రవాహనాలు, 30 వేల కార్లు, ఐదువేల ఆటోలు… వరదకు దెబ్బతిన్నాయి. ఇళ్లల్లో రూ.లక్షలాది విలువచేసే ఎలక్ట్రానిక్ వస్తువులు ధ్వంసమయ్యాయి. వేలాది ఇళ్లల్లో అరచేతి మందాన ఎర్రటి బురద పేరుకుపో యింది. ఊహతెలిసి ఇంతటి ఉపద్రవాన్ని చూడలేదన్నారు. విద్యుత్‌లేక వారం రోజుల పాటు అమావాశ్య చీకట్లోనే బిక్కుబిక్కుమం టూ గడిపారు. తాగునీరు లేక, కాలే కడుపు తో, పిల్లల రోదనలతో తొలి మూడురోజులూ నరకయాతన అనుభవించారు. 60 ఏళ్ల తర్వాత పది రోజుల పాటు అలజడి సృష్టిం చిన వరద చేదు జ్ఞాపకాలను మిగిల్చింది.