. పరిష్కారం కాని భూసేకరణ సమస్య
. నత్తనడకన పనులు… పట్టించుకోని ప్రజాప్రతినిధులు
విశాలాంధ్ర బ్యూరో`కడప: జాతీయ రహదారుల విస్తరణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ ఉమ్మడి కడప జిల్లాలో 3630 కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్ల పనులకు అటవీశాఖ, భూసేకరణ స్పీడ్ బ్రేకర్‌లుగా మారాయి. దీంతో జాతీయ రహదారిపై పనులు, బ్రిడ్జిల నిర్మాణం నత్తకునడక నేర్పిస్తున్నట్లున్నాయి. కమలాపురం దగ్గర పాపాఘ్ని నదిపై చేపట్టిన బ్రిడ్జి 85 శాతం పనులు పూర్తయ్యాక నిలిచిపోయింది. జిల్లాలో ఈ బ్రిడ్జితో పాటు నాలుగు చోట్ల జాతీయ రహదారి పనులకు భూసేకరణ ప్రధాన అవరోధంగా మారింది. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని ఎంపీలు, ఉన్నతస్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెడితే కానీ భూసేకరణ సమస్య పరిష్కారమై… జాతీయ రహదారి పనులు వేగం పుంజుకునేటట్లు కనిపించడం లేదు. అటవీశాఖ సమస్యలతో పాటు ఓ కాంట్రాక్టర్ చనిపోవడంతో ఆ రోడ్డు పనుల వేగం తగ్గింది. ఈ పనులు వేగవంతమైతే ఉమ్మడి కడప జిల్లాలో దాదాపు అన్ని ప్రధాన రోడ్లు జాతీయ రహదారులుగా ప్రాధాన్యత సంతరించుకుంటాయి.
నిలిచిపోయిన బ్రిడ్జి పనులు
కడప-తాడిపత్రి జాతీయ రహదారిలోని కమలాపురంలో పాపాఘ్నినదిపై గల హైలెవల్ బ్రిడ్జి 2021 నవంబరులో వరదల కారణంగా కొట్టుకుపోయింది. రూ.55 కోట్లతో ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు. ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 15 శాతం పనులు చేసేందుకు అటవీశాఖ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన భూములు అటవీశాఖ పరిధిలో ఉన్నాయి. ఆ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లా అధికార యంత్రాంగం జోక్యం చేసుకొని అటవీశాఖ అధికారులతో సంప్రదించి మిగిలిన పనులు పూర్తి చేసి హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులు పూర్తి చేయకపోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 3630 కోట్లతో జిల్లాలోని కమలాపురం బ్రిడ్జితో పాటు 8 జాతీయ రహదారుల పనుల్లో కొన్ని పురోగతిలో, మరికొన్ని నత్తనడకన, మరికొన్ని టెండర్లు, ఒప్పందాల దశలో ఉన్నాయి. వీటి వివరాలు పరిశీలిస్తే… కడప జిల్లా ముద్దనూరు-అనంతపురం జిల్లా తాడిపత్రి మార్గమధ్యంలో రూ.425 కోట్లతో 51 కిలోమీటర్ల జాతీయ రహదారుల పనులు చేపట్టారు. ఈ పనులు మరో ఆరు నెలల్లో పూర్తి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నంద్యాల జిల్లా చాగలమర్రి- కడప జిల్లా వేంపల్లె మార్గమధ్యంలో రూ.1,300 కోట్లతో చేపట్టిన రహదారులకు సంబంధించి టెండర్లు పూర్తి అయినా పనులు మొదలు పెట్టలేదు. రాయచోటి-వేంపల్లె మార్గంలో రూ.250 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఈ రహదారిలో అటవీ భూములు ఉండడంతో కొంత సమస్య ఏర్పడిరది. దీంతో పాటు సంబంధిత కాంట్రాక్టర్ చనిపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. కాంట్రాక్టర్‌కు సంబంధించిన వారు పనులు మొదలు పెట్టకపోతే పాత టెండరును రద్దు చేసి… తిరిగి కొత్త టెండర్ పిలవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ముద్దనూరు-పులివెందుల- బి కొత్తపల్లె మార్గంలో రూ.1100 కోట్లతో రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలిచారు. జమ్మలమడుగు-గుండ్లకుంట మధ్య రూ.200 కోట్లతో రహదారుల నిర్మాణానికి టెండర్లు ప్రక్రియ పూర్తయింది. కాంట్రాక్టర్‌తో ఒప్పందం కూడా జరిగింది. ఇవే కాకుండా మైదుకూరు-ముదిరెడ్డిపల్లె మార్గంలో రూ.100 కోట్లతోనూ, ముదిరెడ్డిపల్లె నుండి జిల్లా సరిహద్దు వరకు (నెల్లూరు జిల్లా) రూ.200 కోట్లతో రోడ్డు విస్తరణ పనులుచేపట్టారు. ఈ రెండు పనులకు సంబంధించి టెండర్లు పూర్తయ్యాయి. పనులు మాత్రం ప్రారంభం కాలేదు.
అటవీ భూసేకరణ అడ్డంకులు
జాతీయ రహదారుల విస్తరణ పనులకు నాలుగు చోట్ల అటవీ భూముల సేకరణ సమస్యగా మారింది. వీటిలో కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై హైలెవల్ బ్రిడ్జి, కడప జిల్లాలోని ముదిరెడ్డిపల్లి-కడప, నెల్లూరు జిల్లా సరిహద్దు వరకు చేపట్టాల్సిన పనులు, వేంపల్లి-కర్నూలు జిల్లాలోని చాగలమర్రి వరకు చేపట్టిన పనులు, ముద్దనూరు- పులివెందుల-బి కొత్తపల్లి రోడ్డు పనులకు సంబంధించి భూసేకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ భూసేకరణ పూర్తయితేగానీ ఈ జాతీయ రహదారుల పనులు వేగవంతమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కాగా, జాతీయ రహదారుల పనుల పురోగతి, కొత్తగా చేపట్టనున్న రోడ్ల విస్తరణ పనులపై నేషనల్ హైవేస్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సి.విజయ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రహదారుల నిర్మాణానికి సంబంధించి అటవీశాఖతో సమస్యలతో పాటు వివిధ రకాల కారణాలను ఉన్నతాధికారుల సహకారంతో అధిక మించి… పనులు వేగవంతం చేస్తామన్నారు.