అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల్లో అక్రమాలు
. ఏసీబీ అదుపులో తనయుడు, బాబాయ్
. అధికారుల సోదాలు… కీలక పత్రాల స్వాధీనం
. మరో కేసులో మాజీమంత్రికి పోలీసుల నోటీసు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : అగ్రిగోల్డ్ భూముల అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ రూరల్ పరిధిలోని అంబాపురం దగ్గర అగ్రిగోల్డ్ భూముల క్రయ విక్రయాల వ్యవహారంలో కీలక నిందితుడుగా గుర్తించిన ఏసీబీ అధికారులు వైసీపీ నేత, మాజీమంత్రి జోగి రమేశ్ కుమారుడు జోగి రాజీవ్, బాబాయ్ జోగి వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి ప్రదర్శనగా వెళ్లిన ఘటనకు సంబంధించి నమోదైన కేసులో విచారణకు రావాలని జోగి రమేశ్‌కు తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీజేశారు. ఈ రెండు సంఘటనల్లో నమోదైన కేసులు జోగి రమేశ్‌ను ఉక్కిరిబిక్కిరిచేశాయి. అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి అక్రమ లావాదేవీలు జరిగాయన్న ఆరోపణలపై మంగళవారం తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి 15మంది ఏసీబీ అధికారుల బృందం చేరుకుని సోదాలు చేపట్టారు. వివిధ కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సమయంలో జోగి రమేశ్ ఇంటికి భారీగా వైసీపీ శ్రేణులు తరలివ చ్చారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలోనే జోగి రమేశ్ కుటుంబ సభ్యులపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబం ధించిన రికార్డులు, పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. జోగి రమేశ్ ఇంటిని పూర్తిగా స్వాధీనంలోకి తీసుకుని ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు.
అంబాపురం భూముల రెవెన్యూ రికార్డుల తారుమారు
విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో సీఐడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న అగ్రిగోల్డ్ భూములను జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్, బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేశారు. రెవెన్యూ, గ్రామ అధికారుల సహకారంతో ఆ భూమి రికార్డులను తారుమారు చేసి సర్వే నంబర్లు మార్చారని ఏసీబీ అధికారులు వెల్లడిస్తున్నారు. రాజీవ్ పేరుతో దస్తావేజులు సృష్టించి, అదే భూమిని పగిడిపాటి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులకు విక్రయించారని గుర్తించారు. దీనిపై పోలీసులకు అవ్వా శేష నారాయణ ఫిర్యాదు చేయగా… ఒక నివేదిక తయారుచేసి విజయవాడ సీపీకి అందజేశారు. అదే నివేదికను ఏసీబీ అధికారులకు ఇచ్చారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి, జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్, బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు పాత్రపై ఆరా తీశారు. అగ్రిగోల్డ్ భూ వివాదంపై గత నెలలోనే డీజీపీ విచారణకు ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతోనే ఏజీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఏసీబీ అధికారుల తనిఖీల అనంతరం జోగి రమేశ్ తనయుడు జోగి రాజీవ్‌ను అదుపులోకి తీసుకుని విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ వ్యవహారంలో జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు పాత్రపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఐదుగురి పేర్లు ఉన్నాయని, మరికొన్ని పేర్లు వచ్చే అవకాశముందని ఏసీబీ అధికారులు తెలుపుతున్నారు. ఏ1గా రాజీవ్‌ను, ఏ2గా జోగి వెంకటేశ్వరరావు పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి, వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరికొందరి పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నిందితులుగా ఏసీబీ పేర్కొంది. వీళ్లందరినీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావును గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చి విచారిస్తున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఇంటి దగ్గర నిరసనకు దిగిన కేసులో జోగి రమేశ్ నిందితుడిగా ఉన్నారు. దీనిపై విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆయనకు నోటీసులు జారీచేశారు. దీంతో జోగి రమేశ్‌ను కూడా అరెస్టు చేస్తారన్న చర్చ సాగుతోంది.
అందరిలాగానే భూముల కొనుగోలు: మాజీ మంత్రి జోగి రమేశ్
అగ్రి గోల్డ్ భూములు ఇప్పటికే అటాచ్‌లో ఉన్నాయనీ, అటాచ్‌మెంట్‌లో ఉన్న భూమిని ఎవరైనా కొంటారా అని మాజీ మంత్రి జోగి రమేశ్ ప్రశ్నించారు. కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలి కానీ, నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది బీసీలపై దాడి అని అభివర్ణించారు. తప్పు చేస్తే నడిరోడ్డుపై ఉరేసుకుంటానని జోగి రమేశ్ సవాల్ చేశారు. నాడు చంద్రబాబు ఇంటికి నిరసన తెలిపేందుకే వెళ్లానని, దాడికి కాదన్నారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు గుర్తెరగాలన్నారు. ఏమన్నా ఉంటే తనపై కక్ష తీర్చుకోవాలేగాని, విదేశాల్లో ఎంఎస్ చదివి వచ్చిన తన కుమారుడిని అన్యాయంగా కేసులో ఇరికిస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆయన మండిపడ్డారు.
తన తండ్రిపై కక్షతోనే నన్ను అరెస్టు చేశారు: జోగి రాజీవ్
అగ్రి గోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్ మాల్ జరగలేదని, తన తండ్రిపై కక్షతోనే ప్రభుత్వం తనను అరెస్టు చేయించిందని జోగి రాజీవ్ అన్నారు. అందరూ కొనుగోలు చేసినట్లుగానే తామూ భూమి కొనుగోలు చేశామని చెప్పారు. అగ్రి గోల్డ్ కేసును చట్టపరంగాను, న్యాయపరంగాను ఎదుర్కొంటామని చెప్పారు. తమపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.