కదం తొక్కిన రైతన్నలు
భారీ ర్యాలీ…బహిరంగ సభ
పంట నష్టపరిహారం అందించాలని డిమాండు
విశాలాంధ్ర బ్యూరో`కర్నూలు / డోన్ : రైతు సమస్యలపై సీపీఐ అధ్వర్యాన బుధవారం కర్నూలు జిల్లా డోన్‌లో నిర్వహించిన ‘కరువు కేక’ కార్యక్రమం విజయవంతమైంది. పెద్దఎత్తున తరలి వచ్చిన రైతులు ఎర్రజెండాలు, బ్యానర్లు చేతబూని ర్యాలీలో పాల్గొన్నారు. డోన్ ప్రభుత్వ అతిథిగృహం నుంచి పాతబస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం పాతబస్టాండ్‌లో సీపీఐ డోన్ నియోజక వర్గం కార్యదర్శి ఎన్.రంగనాయుడు అధ్యక్షతన భారీ బహిరంగ సభ నిర్వహించారు. సభను ఉద్దేశించి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు మాట్లాడుతూ… ఒక వైపు అతివృష్ఠి మరో వైపు అనావృష్ఠితో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవడంలో రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విమర్శించారు. రైతులు కడుపు మంటతో చేస్తున్న ఆందోళనే ఈ కరువు కేక అన్నారు. డోన్, ప్యాపిలి, బేతంచెర్ల, వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో రైతులు… పెట్టిన పెట్టుబడులు కూడా రాక ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారన్నారు. నియోజకవర్గానికి చెందిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కి కనీసం నష్టపోయిన పంట పొలాలను పరిశీలించే తీరిక లేకపోవడం దారుణమన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గనకు నియోజకవర్గ ప్రజల కంటే అప్పుల కోసం దిల్లీ చుట్టూ తిరగడమే సరిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు కృషిచేయాలని ఆయన సూచించారు. మల్లెం పల్లెలో రైతుల భూముల్లో అధికారపార్టీ నేతలు ఎర్రమట్టిని అమ్ముకుంటున్నారని, దీనిపై సంబంధిత భూముల రైతులు ఫిర్యాదు చేస్తే మంత్రి ఏం చేశారని ప్రశ్నించారు. రైతులపై డోన్ రూరల్ ఎస్సై దౌర్జన్యం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారని, ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి వైసీపీ కండువ కప్పుకోవాలని సూచించారు. హంద్రీనివా నీటితో 106 చెరువులు నింపే కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, దసరా నాటికి 15 చెరువులు నింపుతామని చెప్పిన మంత్రి సంక్రాంతి వస్తున్నా రెండుచెరువులు కూడా నింపలేదన్నారు. మంత్రి మేలు చేస్తే ప్రజలు ఆదరిస్తారని లేనిపక్షంలో తగిన బుద్ధిచెపుతారని ఆయన హెచ్చరించారు. పంటలు పండక నష్టపోయిన రైతులకు ఎకరాకు 25వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. దిల్లీలో ఆందోళన చేసిన రైతుల పోరాట స్ఫూర్తితో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటాని కి రైతులు సిద్ధం కావాలని రామాంజనేయులు పిలుపు నిచ్చారు.
ఆర్థిక మంత్రి కాదు అప్పుల మంత్రి : గిడ్డయ్య
డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి రాష్ట్ర ఆర్థికమంత్రిగా ఉండి డోన్ నియోజకవర్గం ప్రజలకు చేసిందేమీలేదని, ఆయన ఆర్థిక మంత్రికాదు అప్పుల మంత్రి అని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య విమర్శించారు. నియోజకవర్గ సమస్యలను ఆయన పట్టించుకోవడం లేదన్నారు. ఏ సీజన్‌లో నష్టం జరిగితే ఆసీజన్‌లోనే పరిహారం అందచేస్తామని చెప్పిన సీఎం వెంటనే పంట నష్ట పోయినా రైతులను ఆదుకోవా లన్నారు. కరువు కారణంగా ఆగస్టు, సెప్టెంబరు మాసంలో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోగా, నవంబరులో కురిసిన అధిక వర్షాల వల్ల చేతికొచ్చిన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25వేలు ఇవ్వాలన్నారు. మిర్చి, ఉల్లి, పత్తి,ఉద్యానవన పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేల పరిహారం ఇవ్వాలని, బ్యాంకు రూణాలు మాఫీ చేయాలని, బీమా ఇవ్వాలని డిమాండు చేశారు. కర్నూలును కరువు జిల్లాగా ప్రకటించి, వలసలు నివారించేందుకు కరువు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులు ప్రారంభించాలని కోరారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం చేస్తామని అవసరమైతే కలెక్టరేట్, అమరావతిలో సచివాలం ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నబిరసూల్, బాబాకృద్దీన్, రాధాకృష్ణ, పి. సుంకయ్య, ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ లెనిన్‌బాబు తదితరులు మాట్లాడుతూ జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు మంత్రులు ఉన్నా రైతుల సమస్యలపై మాట్లాడటం లేదన్నారు. రెండున్నర సంవత్సరాల్లో సీఎం జగన్ రైతులకు చేసిందేమి లేదని విమర్శించారు. అనంతరం సీపీఐ కృష్ణగిరి మండల సహాయ కార్యదర్శి జే రవిమోహన్, వెల్దుర్తి మండల కార్యదర్శి కృష్ణ, ప్యాపిలి మండల కార్యదర్శి వెంకటేష్, పట్టణ సహాయ కార్యదర్శి ప్రభాకర్, పులిశేఖర్ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కృష్ణగిరి మండల కార్యదర్శి ఖలీల్, ఏపీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోటా రాముడు, ఏఐటీయూసీ నాయ కులు లక్ష్మీనారాయణ, అబ్బాస్, పుల్లయ్య, రైతుసంఘం నాయకులు చిన్నరంగన్న,నారాయణ, సుధాకర్, ఎస్ మున్ని వరదరాజులు, హసీనా, లక్ష్మీదేవి, శివన్న, రంగరత్నం పాల్గొన్నారు.
సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా : తహసిల్దార్
బహిరంగ సభ వేదిక నుంచి తహశీల్దార్ కార్యాలయం ముట్టడికి వెళ్లాలన్న నిర్ణయాన్ని తెలుసుకున్న తహసిల్దార్ సత్యదీప్… పాతబస్టాండ్‌లో జరుగుతున్న కరువు కేక బహిరంగ సభ వద్దకు వచ్చి సీపీఐ నాయకులతో మాట్లాడారు. దీంతో నాయకులు తహశీల్దార్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. నాయకులు అందజేసిన వినతిపత్రంతో పాటు వ్యవసాయ అధికారులతో మాట్లాడి పంటనష్టపోయిన రైతుల వివరాలతో కూడిన సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపిస్తామని, రైతులకు పరిహారం అందేలా చూస్తామని తహసిల్దార్ హామీ ఇచ్చారు.