సిట్ అధిపతిగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి
సభ్యులుగా విశాఖ డీఐజీ గోపీనాథ్, కడప ఎస్పీ హర్షవర్ధన్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిపై విచారణకు సిట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉన్నారు.
నలుగురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు
రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి యువరాజ్‌కు ప్రభుత్వరంగ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కేటాయించారు. ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీ మనజీర్ జిలానీ సమూన్‌ను రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వైస్ చైర్మన్‌గా, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆర్ అండ్ ఆర్ కమిషనర్ ఎస్.రామసుందర్ రెడ్డికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా, ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఎండీ దినేశ్ కుమార్‌కు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.