ఏపీకి ప్రశాంత్‌కుమార్ మిశ్రా తెలంగాణకు సతీష్ చంద్ర శర్మ
కొలీజియం సిఫార్సులకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి
విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి : ఉభయ తెలుగు రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రశాంత్ కుమార్ మిశ్రా నియమితులు కాగా, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సీజేగా కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సతీశ్ చంద్ర శర్మ నియమితులయ్యారు. గత నెల 17న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం అనేక మంది న్యాయమూర్తులకు సీజేలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు ఐదుగురు సీజేలను బదిలీ చేయాలని కేంద్రానికి ప్రతిపాదన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు కొత్త ప్రధాన న్యాయమూర్తుల పేర్లను కొలీజియం సిఫారసు చేసింది. కొలీజియం సిఫార్సులకు శనివారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు సీజేగా పని చేస్తున్న అరూప్‌కుమార్ గోస్వామి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. ఆయన కొద్ది నెలల క్రితమే సిక్కిం రాష్ట్రం నుంచి బదిలీపై వచ్చారు. అలాగే ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర సీజేగా పని చేస్తున్న అదే రోజు బదిలీపై వచ్చి, ఇద్దరు సీజేలు మళ్లీ ఒకేసారి బదిలీ కావడం విశేషం.
ప్రశాంత్ కుమార్ మిశ్రా…
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా 1964 ఆగస్టు 29న ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గడ్‌లో జన్మించారు. బిలాస్‌పుర్‌లోని గురు ఘసీదాస్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ పట్టాలు పొందారు. 1987 సెప్టెంబరు 4న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రాయ్‌గడ్ జిల్లా కోర్టుతోపాటు మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ హైకోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2005 జనవరిలో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ద్వారా సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. ఆ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్‌గానూ పని చేశారు. హైకోర్టు నియమాల రూపకల్పన కమిటీ సభ్యునిగా పని చేశారు. 2004 జూన్ 26 నుంచి 2007 ఆగస్టు 31 వరకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అదనపు అడ్వకేట్ జనరల్‌గా సేవలు అందించారు. ఆ తర్వాత అడ్వకేట్ జనరల్‌గా పదోన్నతి పొందారు. 2009 డిసెంబరు 10న ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఉన్న ఆయన.. తాజాగా ఏపీ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు.
సతీశ్ చంద్ర శర్మ
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ 1961 నవంబరు 30న మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జన్మించారు. ప్రాథమిక విద్య జబల్‌పూర్‌లోని సెంట్రల్ స్కూల్‌లో పూర్తి చేశారు. 1981లో సాగర్‌లోని డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ పట్టా పొందారు. అదే విశ్వవిద్యాలయం నుంచి 1984లో ఎల్‌ఎల్‌బీ డిగ్రీని పొందారు. అందులో మూడు బంగారు పతకాలు సాధించారు. 1984 సెప్టెంబరు 1న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1993లో అడిషినల్ సెంట్రల్ గవర్నమెంట్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2003లో మధ్య ప్రదేశ్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయవాది హోదాను పొందారు. 2008 జనవరి 18న మధ్య ప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2010 జనవరి 10న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. తాజాగా తెలంగాణ హైకోర్టుకు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.