దర్యాప్తు, విచారణ సంస్థలకు సీఎం చంద్రబాబు ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విచారణలో జాప్యాన్ని నివారించి… కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీస్ ఉన్నతాధి కారులను ఆదేశించారు. రాష్ట్రంలోని దర్యాప్తు, విచారణ సంస్థల అధికారులతో సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న వివిధ కేసుల విచారణ, వాటి దర్యాప్తునకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఫైబర్ నెట్, మదనపల్లెలో ఫైళ్ల దగ్ధం, ఇసుక దోపిడీకి సంబంధించిన కేసులపై ఆరా తీశారు. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసుపై సీఐడీ విచారణ జరుపుతోంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో చేపట్టిన చర్యలతో పాటు కేసు పురోగతిపై చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతంలో జరిగిన ఇసుక దోపిడీపైనా విచారణ జరుగుతోంది. దీనిపైనా సీఎం వాకబు చేశారు. అలాగే మద్యం కుంభకోణంపైనా సంబంధిత అధికారులను చంద్రబాబు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్, డీజీపీ ద్వారకా తిరుమలరావు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, విజిలెన్స్ డీజీ, సీఐడీ అధిపతి హాజరయ్యారు.