. విద్యుత్ స్తంభానికి కట్టేసి చితకబాదిన వైనం
. గ్రామంలోకి రాకూడదని హుకుం
. కర్నూలు జిల్లా కల్లుకుంటలో ఘటన
. కులాంతర వివాహ వివాదమే కారణం!
విశాలాంధ్ర-పెద్దకడబూరు : దళిత మహిళపై దాడి ఘటన కర్నూలు జిల్లాలో కలకలం సృష్టించింది. శుక్రవారం పెద్దకడబూరు మండలంలోని కల్లుకుంట గ్రామంలో దళిత మహిళ గోవిందమ్మను స్తంభానికి కట్టేసి ప్రత్యర్థులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. ఎనిమిది నెలల క్రితం గ్రామానికి చెందిన గోవిందమ్మ కుమారుడు ఈరన్న అదే గ్రామానికి చెందిన చాకలి నాగలక్ష్మిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. దీనిపై అప్పట్లో నాగలక్ష్మి కుటుంబ సభ్యులు పెద్దకడబూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇద్దరూ మేజర్లు కావడంతో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ చేసి వివాహం జరిపించారు. అయితే అదే రోజు రాత్రి దళిత కాలనీపై చాకలి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు దాడి చేశారు. దీనిపై పోలీసులు అప్పట్లో కొందరిపై కేసులు కూడా నమోదు చేశారు. అప్పటి నుంచి గోవిందమ్మ కుటుంబం ఊరు వదిలి వెళ్లింది. రెండు రోజుల క్రితం గోవిందమ్మ తన ఇంటికి భయం భయంతో వచ్చి ఎవరికీ కనిపించకుండా ఉంది. అయితే ఈ విషయాన్ని పసిగట్టిన కోడలు నాగలక్ష్మి కుటుంబ సభ్యులు చాకలి నాగలమ్మ, మరికొంతమంది విద్యుత్ సరఫరాను నిలిపివేయించి, దళితురాలైన గోవిందమ్మ ఇంటికి వెళ్లి గ్రామంలోకి రాకూడదని చెప్పినప్పటికీ ఎందుకు వచ్చావంటూ ఘర్షణకు దిగారు. ఆమెను లాక్కొని వెళ్లి తమ కాలనీలో విద్యుత్ స్తంభానికి కట్టేసి వందలాది గ్రామస్తుల సమక్షంలోనే విచక్షణారహితంగా కొట్టారు. నీ కుమారుడు కులాంతర వివాహం చేసుకున్నాడని, మీ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశామని, అయినా గ్రామంలోకి ఎలా వచ్చావంటూ గోవిందమ్మను చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఉన్న వారిని చెదరగొట్టి, అపస్మారక స్థితిలో ఉన్న గోవిందమ్మను చికిత్స నిమిత్తం ఆదోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. కాగా దళిత మహిళ గోవిందమ్మపై దాడి ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నిరంజన్ రెడ్డి విలేకరులకు తెలిపారు. బాధితురాలి కుమారుడు ఈరన్న తమ కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే ద్వేషంతో చాకలి నాగలమ్మ కుటుంబీకులు, మరికొంత మంది కలిసి దళిత మహిళ గోవిందమ్మపై దాడికి పాల్పడ్డారని ఆయన వివరించారు. గోవిందమ్మ ఫిర్యాదు మేరకు చాకలి నాగలమ్మ కుటుంబ సభ్యులు చాకలి భూలక్ష్మి, చాకలి నర్సమ్మ, చాకలి ఉసేనమ్మ, చాకలి లక్ష్మి, చాకలి రంగమ్మ, చాకలి నాగరాజు, చాకలి ఉసేని, చాకలి రాముడు, చాకలి బీమారాజు, చాకలి గుండమ్మతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
నిందితులను కఠినంగా శిక్షించాలని ఆందోళన
కల్లుకుంట గ్రామంలో బీసీ కులస్తులు… దళిత మహిళ గోవిందమ్మను విద్యుత్ స్తంభానికి కట్టేసి దాడి చేయడం అత్యంత దారుణమని దళిత సంఘాల నాయకులు లక్ష్మీనారాయణ, జయన్న, రామతీర్థం తీవ్రంగా ఖండిరచారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో సీఐ మంజునాథ్, ఎస్‌ఐ నిరంజన్ రెడ్డిని కలిసి ఘటనపై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వందలాది మంది చూస్తుండగా గోవిందమ్మను వివస్త్రను చేసి స్తంభానికి కట్టేసి, నీ కుమారుడు పెద్ద కులం అమ్మాయిని ఎలా వివాహం చేసుకొన్నాడని బెదిరించి, దాడి చేయడం దారుణమన్నారు. తక్షణమే నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించకపోతే దళిత సంఘాల అధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటున్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు అమరేష్, కదిరికోట బతుకమ్మ, మాల నరసప్ప, మాల మధుబాబు, మాల రంగన్న, ఆనంద్, నెపోలియన్, పీడీఎస్‌యూ నాయకులు రాజేష్, చార్లెస్, కృపానందం, విజయ్ తదితరులు పాల్గొన్నారు.