అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న రూ.20 వేల లోపు పంపిణీ
10న నేతన్న హస్తం..16న విద్యాకానుక ప్రారంభం
ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లింపు
గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు తప్పనిసరి
నిర్లక్ష్యం చేసే అధికారులపై చర్యలు తప్పవు : సీఎం జగన్
అమరావతి : అగ్రిగోల్డ్ బాధితులు గత వారం రోజులుగా విజయవాడలో చేస్తున్న ఉద్యమానికి ప్రభుత్వం స్పందించింది. వచ్చే నెల 24వ తేదీన రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులందరికీ చెల్లింపులు చేయాలని నిర్ణయించింది. కొవిడ్ నివారణా చర్యలు, రాష్ట్రంలో వర్షాలు, సహాయ కార్యక్రమాలు, ఖరీఫ్‌కు సన్నద్ధత, ఉపాధి హామీ పనులు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, గృహ నిర్మాణం, గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు, ఆగస్టులో అమలు చేయనున్న పథకాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సమీక్షించారు. ఈ సమావేశంలో అగ్రిగోల్డ్ అంశాన్ని సీఎం స్వయంగా ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఆగస్టులో చేయనున్న కార్యక్రమాల్లో దీనిని కూడా చేర్చింది. ఆగస్టు 10న నేతన్న నేస్తం, 16న విద్యాకానుక ప్రారంభించనుండగా, 24న అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపు, 27న ఎంఎస్‌ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్స్‌కు ఇన్సెంటివ్‌లు చెల్లింపు చేయనున్నట్లు సీఎం వెల్లడిరచారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాలు మన మానస పుత్రికలని, వాటిని మనం ఓన్ చేసుకోకపోతే వీటి పురోగతి క్షీణిస్తుందన్నారు. ఈ వ్యవస్థ బతకాలి, మంచి ఫలాలు అందాలని ఆకాంక్షించిన సీఎం, మంచి పర్యవేక్షణ, సమీక్షలు, తనిఖీల ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నారు. క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టని అధికారులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. మీకు మెమోలు ఇవ్వడమంటే నా పని తీరు మీద నేను మెమో ఇచ్చుకున్నట్టేనని, కానీ క్రమశిక్షణను పాటించాలంటే వేరే మార్గం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో అర్హులెవరికీ అన్యాయం జరగడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు. పేదవాడిని పట్టించుకోకపోతే విధులను సరిగా నిర్వర్తించినట్లు కాదన్నారు. క్షేత్రస్థాయి తనిఖీల ద్వారా మాత్రమే పనితీరు, సమర్థత మెరుగుపడతాయన్నారు. వచ్చే స్పందన సమీక్ష నాటికి నూరు శాతం తనిఖీలు జరగాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు. ఇక కరోనా థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో తెలియదు కాని, మనం మాత్రం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు సూచించారు. కొవిడ్ నివారణకు వాక్సినేషన్ ఒక్కటే మార్గమని, అయితే మొత్తం 7 కోట్ల డోసులు అవసరం కాగా, ఇప్పటివరకు 1.53 కోట్ల మందికి మాత్రమే వాక్సిన్ వేయగలిగామన్నారు. కళాశాలలు త్వరలో ప్రారంభమవుతున్నందున టీచర్లకు వాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఇ-క్రాపింగ్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, దీనిద్వారా ఒక పొలంలో ఏ పంట, ఎవరు వేశారు, ఎన్ని ఎకరాలు వేశారు అన్నది నమోదవుతుందని అన్నారు. ముఖ్యంగా పంటల బీమా చేయాలన్నా, సున్నా వడ్డీ ఇవ్వాలన్నా, పంటలు కొనుగోలు చేయాలన్నా ఇదే ఆధారమన్నారు. అలాగే వ్యవసాయ సలహా మండలి సమావేశాలపై కలెక్టర్లు దృష్టిపెట్టాలని, ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని సీఎం ఆదేశించారు. మొత్తం రూ.3,300 కోట్లకుగాను రూ.1,800 కోట్లు పది రోజుల క్రితమే చెల్లించగా, మిగిలిన బకాయిలను ఇవాళ విడుదల చేస్తున్నామని తెలిపారు. రైతు చేతులోకి డబ్బులు వచ్చి ఖరీఫ్‌కు ఉపయోగపడాలని భావించామని, దీనివల్ల అది నెరవేరుతుందన్నారు. జగనన్న పచ్చతోరణం కింద ఆగస్టు 15 నుంచి ఆగస్టు 31 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనిని విజయవంతం చేయడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్ అడ్మినిస్టేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి(హెచ్‌ఆర్) శశిభూషణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.