. కడప నుంచే వైసీపీలో ప్రక్షాళన
. దువ్వాడ శ్రీనివాస్‌కు చెక్
. సొంత మనుషులకే పగ్గాలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వైసీపీలో సంస్థాగత దిద్దుబాటు చర్యలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక, పార్టీ శ్రేణులకు మనోధైర్యం కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. తొలి విడత సొంత జిల్లాను చక్కదిద్దుకుని, ఆ తర్వాత రాష్ట్రంలోని మిగిలిన క్యాడర్ అంతా చక్కదిద్దుకోవాలన్న దూరదృష్టితో జగన్ ముందుకెళ్తున్నారు. కడప, అన్నమయ్య జిల్లాల ఇన్‌చార్జ్‌లను మార్చి తనదైన శైలిలో రాజకీయాలను మొదలుపెట్టారు. ఒక వైపు జిల్లాల వారీగా సమీక్షలు, మరోవైపు పార్టీ ప్రక్షాళన చేపడుతున్నారు. ప్రతి నేతతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడుతూ పార్టీని… పార్టీ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత నాయకులపై ఉందని జగన్ దిశానిర్ధేశం చేస్తున్నారు. పార్టీలో కీలక మార్పులు, నియామకాలు చేపడుతున్నారు. వైసీపీకి కంచుకోటగా నిలిచిన కడప జిల్లాలో 10 సీట్లకుగాను కేవలం మూడు సీట్లకే పరిమితమమైంది. ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేజారకుండా జగన్ ముందస్తు చర్యలు చేపట్టారు. ఆయన స్థానంలో భీమటం జెడ్పీటీసీ రామ గోవిందరెడ్డిని జడ్పీ చైర్మన్‌గా ఖరారు చేశారు. కడప జిల్లా అధ్యక్షుడిగా సొంత మేనమామ, కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డిని నియమించారు. ఆయన కుమారుడు నరేన్ రామానుజన్ రెడ్డిని కమలాపురం ఇన్‌చార్జ్‌గా నియమిస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీకాంత్‌రెడ్డిని ఆ పదవి నుంచి తొలగించి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించారు.
దువ్వాడకు షాక్
ఇంటిపోరు ఎదుర్కొంటున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఇన్‌చార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌ను వైసీపీ తొలగించింది. ఆయన స్థానంలో పేరాడ తిలక్‌ను నియమించారు. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేత అచ్చెన్నాయుడుపై దువ్వాడ పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. రాష్ట్రస్థాయిలో మరికొన్ని మార్పులు పార్టీ చేపట్టింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వేంపల్లి సతీశ్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలను నియమించింది. ఏలూరుజిల్లా అధ్యక్ష పదవికి ఇటీవల ఆళ్ల నాని రాజీనామా చేయడంతో ఆ పోస్ట్‌ను కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావుకు ఇచ్చారు. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కంపూడి రాజాను నియమించారు. ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు, చేనేత విభాగం చైర్మన్‌గా గంజి చిరంజీవి, బీసీ విభాగం చైర్మన్‌గా ఎమ్మెల్సీ రమేశ్‌యాదవ్, విద్యార్థి విభాగానికి పానుగంటి చైతన్యను నియమించారు. వారంతా దాదాపు జగన్‌కు సొంత మనుషులు లాంటివారే. త్వరలో పార్టీ రాష్ట్ర కమిటీల్లోనూ విస్తృతంగా మార్పులు చేపట్టే అవకాశముంది. అటు చట్టసభల్లోనూ వైసీపీ మార్పులు చేపట్టింది. ఉమ్మడి విశాఖజిల్లా ఎమ్మెల్సీగా గెలుపొందిన బొత్స సత్యనారాయణను శాసనమండలిలో వైసీపీ ప్రతిపక్ష నాయకుడిగా నియమించింది. ఇంతకుముందు వరకు కొనసాగిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ఉప నాయకుడిగా బాధ్యతలు అప్పగించింది.
వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణిని, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డిని, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజును, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఖాదర్‌బాషాను వైసీపీ ఆధిష్టానం నియమించింది. రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా వెన్నపూస రవీంద్రారెడ్డిని, రాష్ట్ర మున్సిపల్ విభాగం అధ్యక్షుడిగా రేపాల శ్రీనివాస్‌ను, రాష్ట్ర వలంటీర్ విభాగం అధ్యక్షుడిగా నాగార్జునయాదవ్‌ను, రాష్ట్ర వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా గౌతమ్‌రెడ్డిని, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడిగా మనోహర్‌రెడ్డికి పదవులు దక్కాయి. రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలిగా వంగపండు ఉషను, రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడిగా పోసమరెడ్డి సునీల్‌ను, రాష్ట్ర వికలాంగుల విభాగం అధ్యక్షుడిగా బండెల కిరణ్‌రాజును, రాష్ట్ర గ్రీవెన్స్ విభాగం అధ్యక్షుడిగా నారాయణమూర్తిని, రాష్ట్ర వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఇద్దరు ఎమ్మెల్సీలు…రామచంద్రారెడ్డి (ప్రైవేట్ స్కూళ్లు)ని, చంద్రశేఖర్‌రెడ్డి (గవర్నమెంట్ స్కూళ్లు)ని, రాష్ట్ర అంగన్‌వాడీ విభాగం అధ్యక్షురాలిగా చిన్నమ్మను నియమించారు.