. ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక
. కేజ్రీవాల్ రాజీనామా
న్యూదిల్లీ:
రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడిరది. దిల్లీ కొత్త సీఎం ఎవరో తేలిపోయింది. ఆ రాష్ట్ర మంత్రి ఆతిశీ మార్లీనా సింగ్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు కేజ్రీవాల్ నివాసంలో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఆతిశీ పేరును కేజ్రీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా మద్దతు ప్రకటించారు. కాగా దిల్లీ ముఖ్యమంత్రి పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. సాయంత్రం గవర్నర్ వీకే సక్సేనాను కలిసిన కేజ్రీవాల్ తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభాపక్షనేతగా ఆతిశీ ఎన్నికైనట్లు తెలిపారు. దిల్లీ ప్రయోజనాల దృష్ట్యా జైల్లో ఉన్నప్పుడు రాజీనామా చేయవద్దని కేజ్రీవాల్ భావించారని, అందుకే ఆయన బయటకు వచ్చాక రాజీనామా చేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ నేత, దిల్లీ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడిరచారు. ఈ పరిణామాల క్రమంలో మరో వారం రోజుల్లో ఆతిశీ దిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశాలున్నాయి. షీలా దీక్షిత్ తర్వాత దిల్లీలో మహిళా సీఎంగా ఆతిశీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దిల్లీకి మూడో మహిళా ముఖ్యమంత్రిగా ఆతిశీ విధులు నిర్వర్తించనున్నారు.
ఎన్నికలయ్యేంతవరకే: అతిశీ
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగేంత వరకు మాత్రమే తాను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటానని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించాక మళ్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలు చేపడతారని ఆతిశీ అన్నారు. తదుపరి దిల్లీ సీఎంగా ఎంపికైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… తాను ఇతర పార్టీల్లో ఉన్నట్లయితే కనీసం టికెట్ కూడా దక్కకపోయేదన్నారు. కానీ కేజ్రీవాల్ తనకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసి, ఆ తర్వాత మంత్రిని చేసి, ఇప్పుడు ముఖ్యమంత్రిని చేశారని వెల్లడిరచారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు కేజ్రీవాల్‌కు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించారన్నారు. ఇలాంటి అవకాశం కేవలం ఆమ్ ఆద్మీ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తనకు ఈ అవకాశం కల్పించారని వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టానని అభినందించవద్దని, పూలమాలలు అవసరం లేదని సూచించారు. ఎన్నికల తర్వాత మళ్లీ కేజ్రీవాల్ సీఎం అవుతారన్నారు. మద్యం విధానం కేసులో తప్పుడు ఆరోపణలతో కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారని మండిపడ్డారు. కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం అని, సుప్రీంకోర్టు తీర్పు కేంద్రంలోని బీజేపీకి, దర్యాప్తు సంస్థలకు చెంపపెట్టు అన్నారు. కేజ్రీవాల్ స్థానంలో మరొకరు ఉంటే పదవిని వదులుకునే వారు కాదన్నారు. ‘నేను ఈ బాధ్యత తీసుకున్నంత కాలం నా లక్ష్యం ఒక్కటే. దిల్లీ ప్రజలను రక్షించడానికి అరవింద్ కేజ్రీవాల్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వాని నడపడానికి ప్రయత్నిస్తాను’ అని ఆతిశీ అన్నారు.
సునీతా కేజ్రీవాల్‌కు ఆసక్తిలేదు: సౌరభ్ భరద్వాజ్
అంతకుముందు దిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎంపిక చేసే విషయంపై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మాట్లాడారు. మంత్రి మండలి నుంచి ఎవరో ఒకరు సీఎం అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల గురించి తనకు తెలిసినంతవరకు సునీతా కేజ్రీవాల్ సీఎం అయ్యే అవకాశం లేదని చెప్పారు. ఆమెకు ఆసక్తి లేదన్నారు.
ప్రమాణ స్వీకారం అప్పుడేనా?
సెప్టెంబరు 26-27 తేదీల్లో దిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఆ సమయంలోనే ఆతిశీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆప్ వర్గాలు వెల్లడిరచాయి. ఈసారి ఉప ముఖ్యమంత్రిగా ఎవరినీ ప్రకటించే అవకాశాలు లేవని తెలుస్తోంది. మద్యం విధానం కేసులో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు గత శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించిన కేజ్రీవాల్ 2 రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తానని సంచలన ప్రకటన చేశారు. న్యాయస్థానం నుంచి న్యాయం దక్కిందనీ, ప్రజల నుంచి న్యాయం జరగాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. ప్రజలు తమను నిజాయతీ పరులుగా అంగీకరించేవరకు సీఎం సీటులో కూర్చోబోనని కేజ్రీవాల్ చెప్పారు. దిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాదిలో ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే మహారాష్ట్రతో కలిపి వచ్చే నవంబరులోనే దిల్లీకి ఎన్నికలు జరపాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు.