. రాజ్యాంగ పదవిలో ఉండి ఆధారాల్లేకుండా ఎలా చెబుతారు
. జులైలో నివేదిక వస్తే ఇప్పుడు చెప్పడమేమిటి?
. చంద్రబాబుకు సుప్రీం అక్షింతలు
. తిరుపతి లడ్డూపై తదుపరి విచారణ ఎల్లుండికి వాయిదా
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : తిరుపతి లడ్డూ వ్యవహారంలో సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది. లడ్డూ కల్తీపై ఆధారాల్లేకుండానే రాజ్యాంగ పదవిలో ఉండి బహిరంగ ప్రకటన చేయడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై రాష్ట్రంలో దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ ఎస్వీ సుబ్బారెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా, ఈ అంశంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం సోమవారం మధ్యాహ్నం విచారణ జరిపింది. లడ్డూ తయారీకి జూన్, జులైలో ఎన్ని నెయ్యి ట్యాంకర్లు వాడారనే వివరాలు టీటీడీ తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు వివరించారు. కల్తీ నెయ్యి వాడలేదని, పరీక్షలు జరిపిన తర్వాతే లడ్డూలో వినియోగించామని తెలిపారు. లోపాలుంటే ఆ నెయ్యిని తిరస్కరిస్తారని, ఆ విధంగా తిరస్కరించిన లారీల వివరాలు వెల్లడిరచారు. ధర్మాసనం జోక్యం చేసుకొని… ఎటువంటి ఆధారాల్లేకుండానే సీఎం చంద్రబాబు మీడియా ద్వారా లడ్డూలో కల్తీ జరిగినట్లు బహిరంగ ప్రకటన చేసి స్వామి వారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వెలిబుచ్చింది. అదేసమయంలో టీటీడీ తరపు న్యాయవాదిపై ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.
లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనేదానికి ఆధారాలేంటి? రెండో అభిప్రాయం తీసుకోకుండా సీఎం మీడియాతో ఎలా మాట్లాడారు ? లడ్డూ కల్తీ జరిగినట్లు మీ వద్ద ఆధారాలు ఏమైనా ఉన్నాయా? కల్తీ నెయ్యిని తిరస్కరించామని ఈవో చెప్పారు కదా? అటువంటప్పుడు ఆ నెయ్యి వాడే పరిస్థితి ఉండదు. పైగా ఇదంతా పబ్లిక్ డొమైన్‌లో ఉంది కదా? అలాగే జులైలో నివేదిక వస్తే… సెప్టెంబర్‌లో ఎందుకు చెప్పారు? పరీక్షలకు ఎన్‌డీడీబీని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు.
మైసూర్ లేదంటే గజియాబాద్ ల్యాబ్‌ల నుంచి రెండో అభిప్రాయం ఎందుకు తీసుకోలేదు అంటూ ధర్మాసనం ప్రశ్నలు సంధించింది. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. లడ్డూ కల్తీ జరిగిందని తేల్చేందుకు నమూనాను ల్యాబ్‌కు పంపించారా? అని న్యాయవాది సిదార్థ్ లూథ్రాను ధర్మాసనం నిలదీసింది. సీఎం చేసిన వ్యాఖ్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై వేసిన సిట్‌పై ప్రభావం చూపుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లగా… లడ్డూ అంశంపై దర్యాప్తునకు సిట్ సరిపోతుందా? మీ అభిప్రాయం చెప్పండి అని సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతాను అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. తదుపరి విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.