దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య తక్కువగా నమోదు అవుతున్నాయి.గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,407 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 13 శాతం తగ్గినట్లు ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. కాగా కరోనా బారినపడి నిన్న 804 మంది ప్రాణాలు కోల్పోయారు. . దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,07,981కి చేరింది. కాగా, దేశవ్యాప్తంగా నిన్న రికవరీ కేసుల సంఖ్య 1,36,962గా ఉంది. పస్తుతం, దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 6,10,443, ఇది మొత్తం కేసులలో 1.43 శాతం. అయితే, డెయిలీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. దీంతో ఇప్పటి వరకు దేశంలో 1,72,29,47,688 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు.కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాలు నియంత్రణకు విధించిన ఆంక్షలను సడలిస్తున్నాయి. మార్కెట్లు, దుకాణాలు మరియు ఇతర వ్యాపారాలు సాధారణంగా పనిచేయాలని సిక్కిం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక, రాజకీయ, మత, క్రీడలకు సంబంధించిన సమావేశాలపై ఇకపై ఎలాంటి ఆంక్షలు ఉండవని ఉత్తర్వుల్లో పేర్కొంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ మినహా అన్ని కోవిడ్ ఆంక్షలను తొలగించాలని నిర్ణయించింది. పాఠశాలలు, కళాశాలలు తిరిగి యథావిధిగా ప్రారంభమయ్యాయి. అన్ని సామాజిక, వాణిజ్య, సాంస్కృతిక, రాజకీయ, మతపరమైన కార్యక్రమాలపై ఆంక్షలు పూర్తిగా ఎత్తివేశారు. ఇదిలా ఉంటే దేశంలోనే కరోనా మరణాల్లో కేరళ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ఒక్క రోజులో 241 మరణాలు నమోదయ్యాయి. అయితే 251 బ్యాక్‌లాగ్ మరణాల కొత్త సంఖ్య కూడా కేంద్రానికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కేరళలో ఒక్కరోజులోనే మొత్తం మరణాల సంఖ్య 492కి చేరింది. కేరళ తర్వాత మహారాష్ట్రలో అత్యధికంగా 63 మంది మరణించారు. దీని తర్వాత, కర్ణాటకలో 41 మరణాలు నమోదయ్యాయి.