మహమ్మద్ యూనుస్ ప్రకటన
మాస్కో/ఢాకా : బంగ్లాదేశ్ పరిపాలన బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమని నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనుస్ ప్రకటించారు. విద్యార్థుల ఆకాంక్ష మేరకు దేశానికి నాయకత్వం వహించడాన్ని గౌరవంగా భావిస్తానని తెలిపారు. ‘బంగ్లాదేశ్‌లో చర్యలు అవసరమైతే అందుకు సిద్ధం. నా దేశం, ప్రజల కోసం ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు వెనుకాడబోను. స్వేచ్ఛ, పారదర్శకత ఎన్నికలకు పిలుపునిస్తున్నా’ అని ఆయనన్నారు. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకుగాను పార్లమెంటును రద్దు చేసిన తర్వాత అధికార పగ్గాలు చేపట్టేందుకు యూనుస్ ముందుకొచ్చారు. ఇదిలావుంటే సైనిక పాలన లేక సైన్యం మద్దతిచ్చిన ప్రభుత్వాన్ని అంగీకరించబోమని విద్యార్థి ఉద్యమ నేతలు స్పష్టంచేశారు. విద్యార్థులు ఆమోదించిన వారికే అధికారం ఉండాలని నొక్కిచెప్పారు. దేశంలో శాంతి భద్రతల పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్‌కు నహీద్ ఇస్లాం పిలుపునిచ్చారు. అంతర్జాతీయంగా పేరుగాంచిన, అందరి ఆదరణ కలిగివున్న నోబెల్ గ్రహీత డాక్టర్ మహమ్మద్ యూనుస్ ప్రధాన సలహాదారుగా ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థి ఉద్యమానికి దేశంలో జరిగే హింస, ఆలయాలపై దాడులు, లూటీలు, విధ్వంసంతో ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. ‘యాంటీ డిస్‌క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్’ నేతృత్వంలో ప్రభుత్వాస్తులు, మత సామరస్యాన్ని పరిరక్షించే కమిటీ ఏర్పాటు చేశాం. ఈ కమిటీ స్థానికులకు రక్షణ కల్పిస్తుంది. మైనారిటీలను, ప్రభుత్వ ఆస్తులను, దేశాన్ని కాపాడుకుందాం’ అని నహీద్ ఇస్లాం పిలుపునిచ్చారు.
మహ్మమద్ యూనస్ ఎవరు
మహమ్మద్ యూనస్ పేరును విద్యార్థి నేతలు ప్రతిపాదించగా సైన్యాధికారి అంగీకరించినట్లు తెలిసింది. యూనస్ 1940లో బంగ్లాదేశ్‌లోని చిట్టాగాంగ్‌లో జన్మించారు. సామాజిక కార్యకర్తగా, ఆర్థికవేత్తగా పేరుగాంచారు. మైక్రోఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షలాది మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చి ఘనత సాధించారు. దీంతో 2006లో నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకున్నారు. అలాగే 2009లో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, 2010లో కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ సహా అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు దక్కించుకున్నారు. 2012`18 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్ యూనివర్సిటీకి ఛాన్సలర్‌గా పని చేశారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా గతంలో పని చేశారు.