. వైసీపీ అనుబంధ సంఘాల సమావేశంలో జగన్
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై నాలుగు నెలల్లోనే ప్రజా వ్యతిరేకత ఏర్పడిరదని, ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పరిపాలనను పక్కనపెట్టి… దేవుడికే ఆగ్రహం తెప్పిస్తున్నారని అన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో జగన్ కీలక సమావేశం నిర్వహించారు. జగన్ మాట్లాడుతూ పార్టీలో అనుబంధ విభాగాలు చాలా కీలకమని, పార్టీని గ్రామస్థాయి వరకు విస్తరించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనంలో ఉందని, ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైనా… ఇంతవరకూ సూపర్ సిక్స్ గానీ, సూపర్ సెవన్‌గానీ లేదని ఎద్దేవా చేశారు. అబద్ధాలు మోసం కింద మారి… అవి ప్రజల కోపంగా మారుతున్నాయని, అందుకే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత చూస్తున్నామన్నారు. అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వం విఫలమైందని, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆస్పత్రులు, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా వంటి ప్రజోపయోగ కార్యక్రమాలన్నీ నిలిచిపోయాయని తెలిపారు. మూడు నెలల్లో లక్షన్నర ఫించన్లు తగ్గించారని, జన్మభూమి కమిటీలు వచ్చాయన్నారు. చదువులు లేవు… వ్యవసాయానికి పెట్టుబడి సాయం, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా అటకెక్కాయన్నారు. వ్యవసాయం, చదువులు, వైద్యం.. ఈ మూడు రంగాల్లో ప్రభుత్వం పూర్తిగా తిరోగమన దిశలో పయనిస్తోందని విమర్శించారు. ఇష్టం వచ్చినట్లు దొంగ కేసులు పెట్టి రెడ్‌బుక్ పరిపాలన చేస్తున్నారని, శాంతిభద్రతలు క్షీణించాయని అరోపించారు. విజయవాడలో వరద నష్టాన్ని అంచనా వేయలేని దుస్ధితిలో ఉన్నారని, బాధితులు కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముడుతున్నారని వివరించారు. నాలుగు నెలలకే ప్రభుత్వంపై వ్యతిరేకత తారస్థాయికి వెళ్లడంతో ఎప్పటికప్పుడు ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుపతి లడ్డూ అని ఒకసారి, డిక్లరేషన్ అని మరోసారి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. వైసీపీకి సంబంధించిన దాదాపు 24 అనుబంధ విభాగాలను క్రియాశీలం చేస్తున్నామని, పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనుబంధ సంఘాలు పోషించే పాత్ర చాలా కీలకమైనదని తెలిపారు. పార్టీకి కాళ్లు చేతులు అనుబంధ సంఘాలేనని, ఇవి ఎంత బలంగా ఉంటే పార్టీ అంత బలంగా పోరాడగలదన్నారు.
అనుబంధ విభాగాలకు సంబంధించి జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయి వరకు నియామకాలు చేపట్టాలని, ముందుగా బలమైన జిల్లా అధ్యక్షుల నియామకం జరగాలన్నారు. పార్టీ కోసం కష్టపడే వారికి, ఆ ప్రక్రియలో నష్టపోయిన వారికి పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని, వారికే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టంచేశారు. అనుబంధ విభాగాల అధ్యక్షులు ఎలా పని చేయాలనే దానిపై త్వరలో వర్క్‌షాపు నిర్వహిస్తామని జగన్ చెప్పారు.