. ‘ఆర్‌జీ కర్’ హత్యాచారం కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు
. సందీప్ ఘోష్ ఆస్తులపై దాడులు
కోల్‌కతా : ఆర్‌జీ కర్ వైద్య కళాశాల ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు లై డిటెక్టర్ పరీక్ష కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైలులో జరుగుతోందని అధికారులు ఆదివారం తెలిపారు. మరో ఇద్దరు వ్యక్తులు కోల్‌కతాలోని సీబీఐ కార్యాలయంలో ఆదివారం పరీక్ష నిర్వహించారు. మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌తో సహా నలుగురు వ్యక్తులు శనివారం ఈ లై డిటెక్టర్ పరీక్ష చేయించుకున్నారని అధికారులు వివరించారు. రాయ్, వైద్య కళాశాల మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ సహా ఏడుగురికి లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరింది. ఈ పరీక్షలో వెల్లడయిన విషయాలు విచారణ సమయంలో పరీక్ష సాక్ష్యంగా ఉపయోగించనప్పటికీ, పరిశోధనలు, తదుపరి దర్యాప్తు కోసం కేంద్ర దర్యాప్తు సంస్థకు దిశానిర్దేశం చేస్తాయి. దిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్) నుంచి కోల్‌కతాకు చేరుకున్న పాలిగ్రాఫ్ నిపుణుల బృందం ఈ పరీక్షలు నిర్వహిస్తోందని వారు తెలిపారు. వైద్య కళాశాల సెమినార్ హాల్‌లో 31 ఏళ్ల జూనియర్ వైద్యురాలి మృతదేహం లభ్యమైన ఒక రోజు తర్వాత, ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు రాయ్‌ను అరెస్టు చేశారు. వైద్యురాలి మృతదేహానికి సమీపంలో లభించిన సీసీటీవీ ఫుటేజ్, బ్లూటూత్ పరికరం ఆధారంగా రాయ్‌ను అరెస్టు చేశారు. అతను తెల్లవారుజామున 4 గంటలకు మృతదేహం కనుగొనబడిన కళాశాల సెమినార్ హాల్‌లోకి ప్రవేశించినట్లు ఆరోపణలు వచ్చాయి. రాయ్ (33) 2019 నుంచి కోల్‌కతా పోలీసు శాఖలో పౌర వాలంటీర్‌గా పని చేస్తున్నాడు. శిక్షణ పొందిన బాక్సర్ అయిన నిందితుడు కొన్నేళ్లుగా కొంతమంది సీనియర్ పోలీసు అధికారులతో సన్నిహితంగా మెలిగాడని, ఆ తర్వాత అతన్ని కోల్‌కతా పోలీసు వెల్ఫేర్ బోర్డుకు తరలించి, ఆర్‌జీ కర్ వైద్య కళాశాల ఆస్పత్రిలోని పోలీసు అవుట్‌పోస్ట్‌లో నియమించారు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను రాయ్ ఖండిరచాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలిపై అత్యాచారం, హత్యను కప్పిపుచ్చడానికి స్థానిక పోలీసులు ప్రయత్నించారని సూచిస్తున్నందున దర్యాప్తు చేపట్టే సమయానికి నేర దృశ్యం మారిపోయిందని సీబీఐ గతంలో సుప్రీం కోర్టుకు తెలిపింది. ఆగస్టు 9 ఉదయం ఆస్పత్రి ఛాతీ విభాగంలోని సెమినార్ హాల్‌లో తీవ్ర గాయాలతో ఉన్న వైద్యురాలి మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ఘటనపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు 14న దర్యాప్తు ప్రారంభించిన కోల్‌కతా పోలీసుల నుంచి సీబీఐకి దర్యాప్తును బదిలీ చేస్తూ కలకత్తా హైకోర్టు ఆగస్టు 13న ఆదేశించింది.
సీబీఐ సోదాలు: ఆర్‌జీ కర్ వైద్య కళాశాలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తునకు సంబంధించి కోల్‌కతా, చుట్టుపక్కల ప్రాంతాలలో విద్యా సంస్థ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, మాజీ ఎంఎస్‌వీపీ సంజయ్ వశిష్ఠ్, మరో 13 మంది ప్రాంగణాల్లో సీబీఐ అధికారులు ఆదివారం సోదాలు నిర్వహించారని అధికారులు తెలిపారు. సీబీఐకి చెందిన అవినీతి నిరోధక విభాగం రోగుల నిర్వహణ, సంరక్షణ కోసం సామగ్రిని సరఫరా చేసే వారి నివాసాలు, కార్యాలయాలపై కూడా సోదాలు చేసింది. దర్యాప్తు సంస్థకు చెందిన కనీసం ఏడుగురు అధికారులు ఉదయం 8 గంటల నుంచి ఘోష్‌ని బెలియాఘట నివాసంలో ప్రశ్నిస్తున్నారు. మరికొందరు అధికారులు మాజీ వైద్య సూపరింటెండెంట్, ఆస్పత్రి వైస్ ప్రిన్సిపాల్ వశిష్ఠ్, మెడికల్ ఫోరెన్సిక్-వైద్య విభాగానికి చెందిన మరొక ప్రొఫెసర్ సహా ఇతరులను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర బలగాల భారీ బృందంతో పాటు సీబీఐ బృందం ఉదయం 6 గంటలకు ఘోష్ నివాసానికి చేరుకుంది. అయితే అతను తలుపులు తెరవడానికి ముందు దాదాపు ఒకటిన్నర గంటల పాటు వేచి ఉండేలా చేశారని అధికారులు తెలిపారు. సీబీఐ ఇతర అధికారులు హౌరాలోని ఒక సరఫరాదారు నివాసానికి వెళ్లారని వివరించారు. ఎంఎస్‌వీపీగా ఉన్నప్పుడు ఆస్పత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకల గురించి వశిష్ఠ్‌కు ఎంతవరకు తెలుసని ప్రశ్నిస్తున్నారు. మరో సీబీఐ అధికారుల బృందం ఆస్పత్రిలోని మాజీ ప్రిన్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించడంతో పాటు అకడమిక్ భవనంలోని క్యాంటీన్‌కు కూడా వెళ్లింది. వారు ప్రస్తుత ప్రిన్సిపాల్ మానస్ కుమార్ బందోపాధ్యాయను ఉదయం ఆస్పత్రికి చేరుకోవాలని, వైద్య సంస్థలో వారి శోధనల సమయంలో తమతో పాటు రావాలని కోరారు. ఆగస్టు 9న ఆస్పత్రిలోని సెమినార్ హాల్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఆ తర్వాత కోల్‌కతా పోలీసు పౌర వాలంటీర్‌ను అరెస్టు చేశారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ హత్యాచారం ఘటనతో పాటు ఆర్థిక అవకతవకలపై కేసులు నమోదు చేసింది.