. వరద బాధితుల ఖాతాల్లో రూ.602 కోట్లు జమ
. దేశంలోనే అత్యధిక ఆర్థిక సహాయం అందించాం
. రికార్డుస్థాయిలో రూ.400 కోట్ల విరాళాలు
. అత్యంత పారదర్శకంగా నష్ట గణన చేపట్టాం
. సహాయ పంపిణీలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: బుడమేరు వరదలు, భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు దేశంలో ఎన్నడూ లేని విధంగా రికార్డుస్థాయిలో కేవలం పక్షం రోజుల్లోనే నష్టపరిహార సాయం అందించామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. వరదల వల్ల రాష్ట్రంలో మొత్తం రూ.7,600 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బుధవారం విజయవాడలోని జిల్లా కలెక్టరేట్‌లో వరదబాధితులకు పరిహార పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ బుడమేరు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులతో పాటు ఇతర వరద బాధితులకు రూ.602 కోట్ల మేర ఖాతాల్లో నేరుగా జమ చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బాధితులకు ఆర్థిక సాయం అందజేశామన్నారు. ఇంకా ఎవరైనా అర్హులుంటే ఈ నెల 30వ తేదీ నాటికి పరిష్కరించి… సాయం అందిస్తామని చెప్పారు. చిట్టచివరి బాధితుడికీ సాయం అందే వరకు విశ్రమించబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు. అత్యంత పారదర్శకంగా లబ్ధిదారుల జాబితా ఎంపిక చేసి… సచివాలయాల్లో ప్రదర్శించి, బాధితులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.
బాధితులకు మనోధైర్యమిచ్చాం
సింగ్‌నగర్‌లోని పరిస్థితిని చూసి కలెక్టరేట్‌లోనే మకాం వేసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాం. అప్పటి పరిస్థితిని చూస్తే చాలా బాధేస్తుంది. సీఎస్ మొదలు సీనియర్ ఐఏఎస్ అధికారులందర్నీ వార్డుల్లో పెట్టి ప్రత్యక్షంగా సహాయక చర్యలు పర్యవేక్షించాం. వరద సహాయక చర్యల కోసం ఒక్కో జిల్లాకు రూ.3 కోట్లు తక్షణ సాయం కింద నిధులిచ్చి ఆర్డర్ల కోసం నిరీక్షించకుండా ఖర్చుపెట్టమని ఆదేశాలిచ్చాం. కేంద్రంలో ఉన్న ప్రముఖులతో మాట్లాడి రాత్రికి రాత్రి ఆరు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను, 100 పవర్ బోట్లు, హెలికాప్టర్లు తెప్పించాం. 120 బోట్లు, 150 డ్రోన్లు కూడా ఉపయోగించాం. గండ్లు పూడ్చడంతో పాటు నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులను కూడా తొలగించాం. ప్రమాదకర ప్రాంతాలకు అయితే నేను నాలుగైదుసార్లు వెళ్లాను. ప్రజల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకొని అవసరమైన సహాయసహకారాలు అందించాం. బాధితులకు మనోధైర్యం కల్పించాం. డ్రోన్లు, ఫైర్ ఇంజిన్లు ఉపయోగించడం వంటి వినూత్న కార్యక్రమాలతో సహాయమందించాం. సహాయకచర్యల్లో వేలాది మంచి పనిచేశారు. కోటి 14 లక్షల నీటి బాటిళ్లు, 37 లక్షల లీటర్ల పాలు, 47 లక్షల బిస్కెట్ ప్యాకెట్లు, 5 లక్షల గుడ్లు పంపిణీ చేశాం. కోటి 15 లక్షల ఆహార ప్యాకెట్లు అందజేశాం. 5000 క్వింటాళ్ల కూరగాయలు, నిత్యావసర సరుకులు 2,45,000 మందికి పంపిణీ చేశాం. ఫైర్ ఇంజిన్లను ఉపయోగించి దాదాపు 75 వేల ఇళ్లను, 330 కిలోమీటర్ల మేర రహదారులను, వీధుల్లోని బురదను శుభ్రం చేశాం. దాదాపు 20 వేల మెట్రిక్ టన్నుల చెత్తను తరలించాం. భవిష్యత్తులో ఇలాంటి వరదలు ఏవైనా ఎదురైనప్పుడు ఈ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విపత్తు నిర్వహణ కొత్త ఆవిష్కరణకు దారితీసిందని చంద్రబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, పి.నారాయణ, సత్యకుమార్ యాదవ్, గుమ్మడి సంధ్యారాణి, సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ పాల్గొన్నారు.