20 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ పోస్టుల భర్తీ
టీడీపీ16, జనసేన
3, బీజేపీ`1
ఆర్టీసీ చైర్మన్‌గా కొనకళ్ల నారాయణ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల జాతర మొదలైంది. దీంతో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల్లో సందడి మొదలైంది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తానని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ప్రకటించారు. దీంతో పై మూడు రాజకీయపార్టీల్లో ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ముఖ్యమంత్రి 20 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్ పోస్టులను భర్తీ చేశారు. పార్టీ కష్ట కాలంలో ఉన్న సమయంలో పని చేసిన వారు, అలాగే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ దక్కని వారు, పొత్తుల్లో భాగంగా తమ సీట్లు త్యాగం చేయాల్సి వచ్చిన వారిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఈ నామినేటెడ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా తొలి విడతగా 99 మందిని నామినేటెడ్ పోస్టులకు ఆయన ఎంపిక చేశారు. 20 కార్పోరేషన్లకు చైర్మన్‌లు, సభ్యులను నియమించారు. ఈ నియామకాల్లో సామాన్య కార్యకర్తలకు, బీసీ, ఎస్సీ, మైనార్టీ, ఎస్టీలకు ప్రాధాన్యం దక్కింది. ఇందులో భాగంగా 11 మంది క్లస్టర్ ఇంఛార్జ్‌లకు పదవులు కేటాయించారు. ఒక క్లస్టర్ ఇంఛార్జిని చైర్మన్ పదవిలో నియమించింది. అలాగే ఆరుగురు యూనిట్ ఇంఛార్జ్‌లకు పదవులు దక్కాయి. కాగా నామినేటెడ్ పోస్టుల్లో 99 శాతం పదవులు యువతకే కేటాయించడం విశేషం. నామినేటెడ్ పోస్టుల భర్తీలో సీఎం చంద్రబాబు టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నేతలకు స్థానం కల్పించారు. టీడీపీ -16, జనసేన -3, బీజేపీ -1 చొప్పున మొత్తం 20 నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేశారు. ఆర్టీసీ చైర్మన్ గా టీడీపీ మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్(బీజేపీ), శాప్ చైర్మన్ గా అనిమిని రవి నాయుడు, పౌర సరఫరాల కార్పోరేషన్ చైర్మన్‌గా తోట మెహర్ సీతారామ సుధీర్(జనసేన), ఏపీ హౌసింగ్ బోర్డ్‌కు బత్తుల తాత్యబాబు, ఏపీ ట్రైకార్‌కు బొరగం శ్రీనివాసులు, ఏపీ మారిటైమ్ బోర్డుకు దామచర్ల సత్య, ఉపాధి కల్పన అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ సొసైటీకి దీపక్ రెడ్డి, మార్క్‌ఫెడ్‌కు కర్రోతు బంగార్రాజు, స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు మన్నె సుబ్బారెడ్డి, ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ)కు మంతెన రామరాజు, పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి సంస్థకు నందం అబద్దయ్య, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు నూకసాని బాలాజీ, ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పీఎస్ మునిరత్నం, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు పీలా గోవింద సత్యనారాయణ, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు పిల్లి మాణిక్యాల రావు, రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలికి పీతల సుజాత, ఏపీ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు తమ్మిరెడ్డి శివశంకర్ (జనసేన), ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు వజ్జా బాబురావు, ఏపీ టౌన్‌షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌కు వేములపాటి అజయ్‌కుమార్ (జనసేన) చైర్మన్‌లుగా నియమితులయ్యారు.