. వరదల్లో నీట మునిగిన ఇళ్లకు రూ.25వేలు
. మొదటి అంతస్తుకు రూ.10వేలు
. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన బాధితులకు పరిహారాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీజేసింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఆర్‌ఎఫ్) నిర్దేశించిన మొత్తం కంటే, ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సోమవారం ఉత్తర్వులు జారీజేశారు. ఇళ్లు, పంటలు, వ్యాపారాలు, ఉపాధి పరిశ్రమలు, పశువులు, కోళ్లు, వాహనాలకు జరిగిన నష్టంపై పరిహారంగా ఇవ్వనున్న ఆర్థికం సాయం ప్రకటించారు. గతంలో 175 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఇళ్లు పూర్తిగా నీట మునిగిన బాధితులకు ఎస్‌డీఆర్‌ఎఫ్ నిర్దేశించిన రూ.11వేలకు బదులుగా రూ.25వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం వెల్లడిరచింది. మొదటి అంతస్తులోగానీ, ఆపైన ఉన్న ముంపు బాధితులకు రూ.10వేలు, వరదలకు ధ్వంసమైన దుకాణాలకు రూ.25వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తారు. వరదలు, వర్షాల కారణంగా ఇళ్లు ధ్వంసమైన వారికి కూడా గృహ నిర్మాణ పథకాల కింద ఇంటిని నిర్మించి ఇస్తామని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. ఎస్‌డీఆర్‌ఎఫ్ నిర్దేశించిన మొత్తం కంటే..అదనంగా ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను మార్చుతున్నట్లు రెవెన్యూశాఖ తెలిపింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వరద ప్రభావంతో నష్టపోయిన బాధితుల ఇళ్లకు రూ.10వేల ఆర్థిక సాయం అందించనున్నారు. ఈనెల 17వ తేదీన సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు అనుగుణంగా వరద ముంపు బాధితులకు సాయం చేస్తున్నట్లు ఉత్వర్వులో స్పష్టం చేశారు. వరదలతో నీట మునిగిన వ్యవసాయ, వాఱిజ్య, ఉద్యానవన పంటలకూ గతంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ విధానాలకు అనుగుణంగా ప్రకటిం చిన దానికంటే అధికంగా ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని పెంచింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ నగరం వరద ముంపుతో అతలాకుతలం అయింది. 12 రోజులపాటు అనేక కాలనీల్లో ఇళ్లు వరద నీటిలో నానాయి. ప్రభుత్వం వరద ముంపు బాధితులకు యుద్ధప్రాతిపదికన సహాయక సేవలందించడంతో పాటు మరోవైపు ఇంటింటికీ ప్రభుత్వ సిబ్బందిని పంపి నష్ట గణన చేయించింది. ఈ సమయంలో పాక్షికంగా, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లను అధికారులు పరిశీలించారు. ధ్వంసమైన దుకాణాల వివరాలను సేకరించారు.