కోల్‌కతా : పశ్చిమబెంగాల్ ఉపఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)హవా కొనసాగింది. మొత్తం నాలుగు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ అభ్యర్థులపై భారీ మెజారిటీ సాధించి చిత్తుగా ఓడిరచింది. ఇది విద్వేష రాజకీయాలపై బెంగాల్ ప్రజలు సాధించిన విజయమని సీఎం మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. బెంగాల్ ప్రజలు అభివృద్ధికే పట్టం గడతారన్నారు. టీఎంసీ ఘన విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. దిన్‌హాటా, శాంతిపుర్, గోసబ, ఖార్‌దహ అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 30న ఎన్నికలు జరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్-మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దిన్‌హాటాలో బీజేపీ నేత నిశిత్ ప్రామాణిక్ గెలుపొందారు. ఆయన్ను కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా తీసుకోవడంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు టీఎంసీ ఆ స్థానాన్ని లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో కైవసం చేసుకోవడం విశేషం. కాగా ఖార్‌దహ అసెంబ్లీ స్థానాన్ని 93,832 ఓట్ల ఆధిక్యతతో టీఎంసీ గెలుచుకుంది.