తల్లిదండ్రుల మృతితో.. అనాధలుగా 1,47,492 మంది చిన్నారులు
సుప్రీంకు తెలిపిన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్
న్యూదిల్లీ : కరోనా మహమ్మారి సృష్టించిన విలయం కోట్లాది మంది జీవితాలను చిధ్రం చేసింది. దేశ వ్యాప్తంగా వైరస్ మహమ్మారి బారినపడి తల్లితండ్రుల్లో ఒకరిని లేదా ఇద్దరినీ కోల్పోయిన పిల్లలు లక్షల సంఖ్యలో ఉన్నట్టు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సుప్రీం కోర్టుకు తెలిపిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. 2020 ఏప్రిల్ 1 వ తేదీ నుంచి 2022 జనవరి 11 నాటికి దేశంలో 1,47,492 మంది అభంశుభం తెలియని చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయినట్టు సుప్రీంకోర్టుకు అందించిన వివరాల్లో వెల్లడిరచింది. ఇందులో 76,508 మంది బాలురు, 70,980 మంది బాలికలు, నలుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్టు పేర్కొంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి బాల్ స్వరాజ్ పోర్టల్-కోవిడ్ కేర్‌కు అందిన సమాచారం మేరకు ఈ వివరాలు ఉన్నట్టు తెలిపింది. ఇందులో కరోనా కారణంగా తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయిన 10,094 మంది ఉన్నారని, మిగిలిన వారిలో తల్లి లేదా తండ్రిని కోల్పోయినట్టు తెలిపింది. వయసుల వారిగా చూస్తే ఎనిమిది నుంచి 13 ఏళ్ల మధ్య వారు 59,010 మంది, 14 15 ఏళ్ల వారు 22,763 మంది, 16
18 ఏళ్లలోపువారు 22,626 వారు కాగా మరో నలుగురు అంతకన్నా అధిక వయస్కులని తెలిపింది. 1,25,205 మంది చిన్నారులు ఒంటిరి తల్లిదండ్రుల సంరక్షణలో ఉండగా, 11,272 మంది వారి బంధువుల వద్ద, 8,450 మంది ఇతర సంరక్షకుల వద్ద ఆశ్రయం పొందుతున్నట్టు పేర్కొంది. ఇక 1,529 మంది చిన్నారులు బాలల సంరక్షణ గృహాల్లో, 188 మంది అనాథ శరణాలయాల్లో, 66 మంది దత్తత తీసుకున్న వారి వద్ద, మరి కొందరు ప్రభుత్వ హాస్టళ్లలో ఉన్నట్టు వివరించింది. ఇక ఈ వివరాలను రాష్ట్రాల వారిగా పరిశీలిస్తే బాధితుల్లో అత్యధికంగా ఒడిశాలో 24,405 మంది ఉండగా మహారాష్ట్రలో 19,623 ఉన్నట్లు కమిషన్ పేర్కొంది. ఇక గుజరాత్14,770, తమిళనాడు
11,014, ఉత్తరప్రదేశ్ 9,247, ఆంధ్రప్రదేశ్
8,760, మధ్యప్రదేశ్ 7,340, పశ్చిమ బెంగాల్
6,835, దిల్లీ 6,629, రాజస్థాన్
6,827 మంది పిల్లలు ఉన్నారని తెలిపింది. వీరి వివరాలను అన్ని సేకరించి వారి ఆరోగ్య సంరక్షణ, విద్య, సహా ఇతర సంరక్షణ చర్యల కోసం అన్ని రాష్ట్రాల అధికారులతో త్వరలోనే వర్చువల్ సమావేశాన్ని నిర్వహించి అవసరమయ్యే అన్ని చర్యలు తీసుకోనున్నట్టు సుప్రీం కోర్టుకు తెలిపింది.