మరో 155 రకాల మందులపైనా…
న్యూదిల్లీ : డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు 156 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) మందులను కేంద్రం నిషేధించింది. వీటిలో యాంటీబయాటిక్స్, నొప్పి నివారణ, మల్టీవిటమిన్ మందులు కూడా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయని పరిశోధనలో తేలింది. ఈ మందుల తయారీ, విక్రయం, పంపిణీని పూర్తిగా నిషేధిస్తున్నామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. నిషేధించ బడిన మందులలో యాంటీబయాటిక్స్, యాంటీ అలెర్జీలు, పెయిన్ కిల్లర్లు, మల్టీవిటమిన్లు, జ్వరం, అధిక రక్తపోటు కోసం ఉపయోగించే మందులు ఉన్నాయి. పారాసెటమాల్ సహా ప్రధాన ఔషధాల జాబితాలో మెఫెనామిక్ యాసిడ్ కూడా చేర్చబడిరది. వీటిని నొప్పి, వాపును తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఒమెప్రజోల్ మెగ్నీషియం, డైసైక్లోమైన్ హెచ్‌సీఎల్ సప్లిమెంట్స్… వీటిని కడుపు నొప్పి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. నిషేధిత జాబితాలో ఎసిక్లోఫినాక్ 50 మిల్లీగ్రామ్‌లు ప్లస్ పారాసెట్‌మోల్ 125 మిల్లీగ్రామ్స్ టాబ్లెట్స్ ఉన్నాయి. మెఫెనామిక్ యాసిడ్ , పారాసెటమాల్ ఇంజెక్షన్, సెటిరిజైన్ హెచ్‌సీఎల పారాసెటమాల్ ఫినైల్‌ఫ్రైన్ హెచ్‌సీఎల్, లెవోసెటిరిజైన్ ఫినైల్‌ఫ్రైన్ హెచ్‌సిఎల్ పారాసెటమాల్, పారాసెటమాల్ క్లోర్‌ఫెనిరమైన్ మలేట్ ఫినైల్ ప్రొపనోలమైన్, కామిలోఫిన్ డైహైడ్‌రోక్లోరైడ్ 25 మి.గ్రా. ఉన్నాయి. దీంతోపాటు పారాసెటమాల్, ట్రామడాల్, టౌరిన్, కెఫిన్ కలయికను కూడా కేంద్రం నిషేధించింది. ఇతర యాసిడ్, మెట్‌ఫార్మిన్ కలయిక ఉంది. డయాబెటిస్‌తో బాధపడేవారిలో ఫ్యాటీ లివర్ చికిత్సకు దీనిని ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులను నివారించడానికి, చికిత్స చేయడానికి పోవిడోన్ అయోడిన్, మెట్రోనిడాజోల్, కలబంద సప్లిమెంట్లను ఉపయోగిస్తారు. యాసిడ్, మెట్‌ఫార్మిన్‌ల ప్రధాన బ్రాండ్‌లలో ఆరిస్ లైఫ్‌సైన్సెస్ ద్వారా తయారు చేయబడిన హెప్‌రెక్సా ఎం మాత్రలు ఉన్నాయి. మాగ్జన్ బయోటిక్స్, మాక్‌డిన్ ఏఎం ఆయింట్‌మెంట్, పోవిడోన్ అయోడిన్, మెట్రోనిడాజోల్, కలబంద మిశ్రమ మోతాదులకు సాధారణంగా అందుబాటులో ఉన్న మందులు. ఔషధానికి సురక్షితమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ ఈ ఎఫ్‌డీసీలను ఉపయోగించడం వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ ఔషధాల వాదనలు సమర్థనీయమని గుర్తించలేదని, రోగికి కలిగే ప్రయోజనాల కంటే వాటి వల్ల కలిగే నష్టమే ఎక్కువగా ఉంటుందని నోటీసులో పేర్కొంది. దీంతో పాటు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940లోని సెక్షన్ 26 ఏ ప్రకారం ఈ ఎఫ్‌డీసీ తయారీ, అమ్మకం లేదా పంపిణీని నిషేధించడం తప్పనిసరి అని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.