ముంబై : కరోనా మూడో తరంగం, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో పిల్లలను పాఠశాలలకు పంపడానికి మహారాష్ట్రలోని మెజారిటీ శాతం తల్లిదండ్రులు అంగీకరించడం లేదని లోకల్ సర్కిల్ అనే ఆన్‌లైన్ కమ్యూనిటీ ప్లాట్‌ఫారమ్ నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24 నుంచి పాఠశాలలను పున:ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో చేపట్టిన ఈ సర్వేలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 4,976 మంది తమ అభిప్రాయాలను పంచుకున్నట్టు ఆ సంస్థ తెలిపింది. తాము నిర్వహించిన సర్వేలో 62 శాతం మంది తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదని స్పష్టం చేసినట్టు తెలిపింది. తమ సర్వేలో పాల్గొన్న వారిలో 67 శాతం మంది పురుషులు, 33 శాతం మంది మహిళలు ఉన్నారని తెలిపింది. రాష్ట్రంలో మూడో వేవ్ ప్రారంభమవడం, ఒమిక్రాన్ వ్యాప్తి అధికమవడంతో ఫిబ్రవరి 15 వరకూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలను మూసి వేయాలని ఈ నెల 8న తీసుకున్న నిర్ణయాన్ని పక్కన పెట్టిన ప్రభుత్వం వచ్చే సోమవారం నుంచి 1 నుంచి12 తరగతులను ప్రారంభించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ముంబై, పూనె, ఔరంగాబాద్ వంటి నగరాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నట్టు లోకల్ సర్కిల్ సర్వేలో వెల్లడైంది. ఇదిలా ఉండగా కేవలం 11 శాతం మంది తమ పిల్లలను బడులకు పంపడానికి సుముఖత వ్యక్తం చేయగా మరో 11 శాతం మంది తల్లిదండ్రులు ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేయలేదని తెలిపింది. మరో వైపు ఇప్పటికే తమ పిల్లలను పాఠశాలలకు పంపుతున్నామని 16 శాతం మంది తెలిపినట్టు పేర్కొంది. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలను ప్రారంభిస్తున్నా విద్యార్థులను భౌతిక తరగతులకు పంపడం, పంపకపోవడం అనేది వారి తల్లిదండ్రుల ఇష్టానికి విడిచిపెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.