బావిలో పడి 13 మంది మహిళల మృతి
కుషీనగర్(యూపీ): వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లిన 13 మంది మహిళలు ప్రమాదవశాత్తు పాతబడిన బావిలో పడి చనిపోయారు. కొంతమంది గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కుషీనగర్ జిల్లా నెబువా నౌరంజియా వద్ద బుధవారం రాత్రి జరిగింది. పెళ్లికి వెళ్లిన బంధువులు సమీపంలోని ఓ బావి స్లాబ్‌పై కూర్చున్నారు. ఆ సమయంలో బరువెక్కువై ఒక్కసారిగా స్లాబ్ కూలింది. దీంతో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. బావిలోపడిన మరికొందరిని స్థానికులు రక్షించారు. మృతుల్లో ఏడుగురు మహిళలు, ఆరుగురు బాలికలు ఉన్నారు. మృతులు 20`35 సంవత్సరాల వయసుగల వారు. ఏడాది పాప కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబాల రోదనలతో ఆసుపత్రి ఆవరణ విషాదంగా మారింది. ప్రమాదంలో 11 మంది మరణించారని, ఇద్దరి పరిస్థితి విషమంతో ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందని కలెక్టరు ఎస్.రాజలింగం మీడియాకు చెప్పారు.
తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారన్నారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు నాలుగు లక్షల పరిహారం ప్రకటించారు.