. పీపీపీ విధానంపై కూటమి దృష్టి
. కొత్త వైద్య కళాశాలలపై కసరత్తు
. విమానాశ్రయాలపైనా ఆలోచన
. రాష్ట్ర రహదారులపై టోల్ చార్జి?
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్రంలోని కొత్త వైద్యకళాశాలలు, విమానాశ్రయాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న దిశగా కూటమి అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జోరందుకుంది. రాష్ట్ర రహదారులపై టోల్ ఫ్రీ విధించాలన్న ఆలోచనకూ తెరతీసినట్లు తెలిసింది. కొన్ని అంశాల్లో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానాలపై అధ్యయానికి సిద్ధమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం చేస్తే ప్రజాగ్రహం తప్పదని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి. మొదటగా... కొత్తగా వచ్చిన వైద్యకళాశాలలను పీపీపీ విధానం అమలు చేసేందుకు ఇటీవల మంత్రి మండలిలో ప్రతిపాదించారు. ఇందుకోసం గుజరాత్ రాష్ట్రంలోని పీపీపీ విధానాన్ని అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు సూచించడం చర్చానీయాంశమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త వైద్యకళాశాలలకు అంకురార్పణ జరిగింది. జాతీయ వైద్య కమిషన్ అనుమతితో మొదటి విడత విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలోకొత్త వైద్యకళాశాలలను నిర్మించారు. 2023
24 విద్యా సంవత్సరం నుంచి ఈ ఐదు వైద్యకళాశాలల్లో 107, 108 జీవోలు జారీజేసి మొత్తం 50 శాతం సీట్లను విక్రయించారు. రెండో విడతగా…పులివెందుల, మార్కాపురం, మదనపల్లె, పాడేరు, ఆదోనిలో మరో ఐదు కొత్త వైద్యకళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. వాటికీ అదే పద్దతి వర్తిస్తుంది. ఒక వైపు ఆయా జీవోలు రద్దుచేయాలని వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం స్పందించడం లేదు. పైపెచ్చూ మంత్రి మండలిలో కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలల కార్యకలాపాలు పీపీపీ విధానానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇదే అమలైతే పేద విద్యార్థులకు వైద్య విద్య పూర్తిగా దూరమైపోతుంది. పేరుకు ఇవి ప్రభుత్వ వైద్య కళాశాలలు అయినప్పటికీ, పూర్తిగా ప్రైవేట్ పరం అయిపోతాయి.
పవన్… మౌనమేల!
రెండో ప్రతిపాదనను చూస్తే… రాష్ట్ర రహదారులపై ప్రయాణించే వాహనాలకు టోల్ ఛార్జీ వసూలు చేయాలనే దానిపై తాజాగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో రహదారులు గుంతలమయం, వాటి అభివృద్ధికి కృషి చేయాలేదంటూ జనసేన పార్టీ అధ్యక్షుడు, ప్రసుత్త ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆందోళన కూ దిగారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే పవన్ సొంత నియోజకవర్గమైన పిఠాపురం నుంచే చెత్తపై పన్నుకు శ్రీకారం చుట్టారు. దానిపైనా అనేక విమర్శలు వస్తున్నప్పటికీ పవన్ ఇంతవరకూ స్పందించలేదు. నాడు రోడ్లు అభివృద్ధి చేస్తామని హామీతో వచ్చిన పవన్… ఇప్పుడు మొదట్లో డబ్బులులేవని… కొంత సమయం కావాలంటూ దాట వేస్తున్నారు. ఇవన్నీ ఒక వైపు చెబుతూనే తెరకింద పీపీపీ పద్దతిలో రాష్ట్ర రహదారులపై టోల్ ట్యాక్స్‌లు విధించే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. ఇటీవల వెలగపూడి సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అధికారులకు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నట్లు ప్రచారం వెలుగులోకి వచ్చింది. అదే జరిగితే ఈ కూటమి ప్రభుత్వానికి సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతుంది. భవిష్యత్‌లో మొత్తం 12,650 కిలోమీటర్ల పరిధిలోని రాష్ట్ర రహదారులపై పన్నుల వసూలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పీపీపీ పేరిట రాష్ట్ర రహదారుల్లో ప్రతిపాదిక టోల్‌టాక్సులు మోయలేని భారంగా మారి, రవాణా రంగాన్ని నష్టాలకు గురిచేస్తాయన్న వాదనలున్నాయి. మూడో అంశంగా … విజయవాడ, రాజమండ్రి, తిరుపతి విమానాశ్రయాలను ప్రైవేట్‌కు అప్పగించే ఆలోచనలో ప్రభుత్వ ఉన్నట్లు తెలిసింది. ఇదే జరిగితే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మూడు విమానాశ్రయాలు పూర్తిగా ప్రైవేట్ పరమవుతాయి. కొత్తగా నిర్మించబోయే విమానాశ్రయాలపైనా ప్రైవేట్ ముద్ర పడే అవకాశముంది.