రూ. 15 పెరిగిన గ్యాస్ ధర
ఈ ఏడాదిలో రూ. 205 పెంపు
ఆగని పెట్రో మంటలు
రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలు
న్యూదిల్లీ : వంటింట్లో గ్యాస్ బండ సామా న్యుల గుండెల్లో గుదిబండలా మారుతోంది. ఓవైపు పెట్రోల్, నిత్యావసరాల ధరలు మోత మోగుతున్న వేళ వంట గ్యాస్ సిలిండర్ ధరపై చమురు సంస్థలు మరోసారి వడ్డించాయి. రాయితీ, రాయితీయేతర ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.15 పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పెరిగిన ధరలు బుధవారం నుంచే అమలులోకి వచ్చాయి. ఇప్పటికే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపో తున్నాయి. ఇప్పుడు మరోసారి గ్యాస్ ధరలు పెరగడంతో వినియోగ దారులుపై మరింత భారం పడిరది. గత రెండు నెలల కాలంలో ఏకంగా నాలుగు సార్లు వంటగ్యాస్ ధరలు రూ.90 పెరగడం సామాన్యుని పాలిట శాపంగా మారింది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ, 15వ తేదీన గ్యాస్ ధరలను చమురు సంస్థలు సమీక్షిస్తాయి. అయితే అక్టోబరు ఒకటో తేదీన వాణిజ్య సిలిండర్ ధరలను పెంచగా.. కొంచెం ఆలస్యంగా వంట గ్యాస్ ధరలను సవరించాయి. ఇక 2021లో వంట గ్యాస్ సిలిండర్‌పై రూ. 205 పెరగడం గమనార్హం. తాజా పెంపుతో దేశరాజధాని దిల్లీలో 14.2 కేజీల వంటగ్యాస్ ధర రూ.899.50, ముంబైలో రూ.889.50, కోల్‌కతాలో రూ.926, చెన్నైలో రూ.915.50, హైదరాబాద్‌లో రూ.925కి చేరింది. సబ్సిడీపై ఎల్‌పిజీ సిలెండర్లు పొందుతున్న ఉజ్వల లబ్ధిదారులు ఇప్పుడు మార్కెట్ ధర చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక 5 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర కూడా రూ .502కి చేరింది. ఇదిలా ఉండగా 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర దిల్లీలో రూ .1736కి చేరుకుంది. వరుసగా ఇలా నిత్యం ధరలను పెంచేస్తుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలుపడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి.
ఆగని పెట్రో మంట
అన్ని రాష్ట్రాల్లో సెంచరీ దాటిన పెట్రోల్ ధరలకు పోటీగా దాదాపు రాష్ట్రాల్లోని డీజిల్ ధరలు కూడా వంద మార్కుకు దగ్గరవుతోంది. అయినా పెట్రోమంటకు బ్రేకులు పడడం లేదు, బుధవారం కూడా ఇంధన ధరలు ప్రియమయ్యాయి. పెట్రోల్ ధర లీటరుకు 30 పైసలు డీజిల్ ధర 35 పైసలు మేర పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు ఏడు సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్టు చమరు సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. తాజా పెరుగుదలతో దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 102.94, ముంబైలో రూ.108.96కి చేరుకుంది. ఇక డీజిల్ ధరల విషయానికి వస్తే దిల్లీలో రూ. 91.42కి పెరుగగా, ముంబైలో లీటరు డీజల ధర రూ .99.17 లకు చేరుకుంది. భిన్నంగా ఉంటాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఏపీ తెలంగాణాలోని అనేక నగరాల్లో డీజిల్ రేట్లు రూ .100 మార్కును దాటేశాయి. ఇప్పటికైనా ఇందనంపై విధిస్తున్న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండు పాలక పక్షం చెవికెక్కకపోవడం, సామాన్యులపై కనీస కనికరం కూడా చూపకపోవడం విచారకరం.