90,533 ఓట్ల భారీ ఆధిక్యతతో డాక్టర్ దాసరి సుధ విజయం
ఉప ఎన్నికలో ఫలించిన వైసీపీ కసరత్తు
డిపాజిట్ కోల్పోయిన బీజేపీ
6,235 ఓట్లు దక్కించుకున్న కాంగ్రెస్
విశాలాంధ్ర ` కడప బ్యూరో : బద్వేల్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప పోరులో వైసీపీ విజయం సాధించింది. ఆ పార్టీ నేతల కసరత్తు ఫలించింది. వారి అంచనాలకు దగ్గరగా 90,533 ఓట్ల భారీ ఆధిక్యతతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ ఘన విజయం సాధించారు. ఆమె భర్త డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి చెందడంతో జరిగిన ఈ ఉప ఎన్నికలో డాక్టర్ సుధను అభ్యర్థిగా వైసీపీ నేతలు బరిలో దించారు. ఎన్నికల ప్రచారం ప్రారంభమైనప్పటి నుండి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఆమెకు పూర్తి సహకారం అందించారు. తెలుగుదేశం పార్టీ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో ఆ ఓట్లు తమకే వస్తాయని బీజేపీ నేతలు ఆశించారు. ఈ ఉప ఎన్నికలో గట్టి కసరత్తు చేశారు.
కేంద్ర మంత్రి మురగన్ నుండి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో పాటు ప్రముఖ నేతలు బద్వేల్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే చివరకు ఆ పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక 14.73 శాతం ఓట్లకే పరిమితమయ్యింది. బీజేపీ అభ్యర్థి పణతల సురేష్‌కు 21,678 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కమలమ్మ వైసీపీ, బీజేపీలాగా ప్రచారంలో హోరెత్తించకపోయినా ఆమెకు 6,238 ఓట్లు వచ్చాయి. వైసీపీ, బీజేపీ హోరాహోరీ ప్రచారం నిర్వహించి, ఎవరు వ్యూహాలకు వారు పదును పెట్టారు. దీంతో ఆ రెండు పార్టీలకు వచ్చే ఓట్లపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ వచ్చింది.
వైసీపీ ఖాతాలో 76.24 శాతం ఓట్లు
ప్రతి రౌండ్‌లోను వేలల్లో ఆధిక్యతతో సాగిన వైసీపీకి పోలైన ఓట్లలో అత్యధికంగా 76.24 శాతం ఓట్లు దక్కాయి. బీజేపీకి 14.73 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 4.23 శాతం ఓట్లు పోలయ్యాయి. నోటాకు 2.48 శాతం ఓట్లు వేశారు. వైసీపీకి సానుభూతి ఓట్లు బాగా పడడంతోపాటు ఆ పార్టీకి బద్వేల్‌లో ఉన్న పట్టు, పార్టీ నేతల వ్యూహాలు, అధికార పార్టీగా ఎన్నికల బరిలో దిగడం లాంటివన్నీ కలిసొచ్చాయి. వైసీపీ ముఖ్య నేతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష, కడప మేయర్ సురేష్‌బాబు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలతోపాటు అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం బద్వేల్‌లో మకాం వేశారు. ప్రతి మండలం, గ్రామంలో పర్యటించి పోలింగ్ రెండు రోజుల ముందు వరకు వారు జరిపిన ప్రయత్నం ఫలించింది. ఎన్నికల్లో వైసీపీ నేతలు ఊహించినట్టే ఆధిక్యత రావడంతో పార్టీ నేతల్లో ఆనందం వ్యక్తమవుతోంది.