కేంద్రం తనిఖీల్లో వెల్లడి
న్యూదిల్లీ: మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడుపోయే బీపీ, షుగర్, పారాసిటమాల్ మందుల్లో నాణ్యతా లోపాలు ఉన్నట్టు తాజాగా బయటపడిరది. కేంద్ర ఔషధ రంగ నియంత్రణ మండలి (సీడీఎస్‌సీఓ) ఇటీవల అనేకచోట్ల జరిపిన తనిఖీల్లో ఈ లోపాలు వెలుగు చూశాయి. పారాసిటమాల్- 500 ఎమ్‌జీ, పాన్-డీ, కాల్షియం సప్లిమెంట్లు వంటి ఔషధాల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించినట్టు అధికారులు గుర్తించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు. ఆ ఫలితాలతో ఓ జాబితా రూపొందించారు. నాణ్యతా ప్రమాణాలు లోపించిన ఔషధాల్లో విటమిన్ బీ కాంప్లెక్స్, విటమిన్ సీ సాఫ్ట్ జెల్స్, షెల్‌కాల్ (విటమిన్ సీ, డీ3), డయాబెటిక్ ఔషధం గ్లిమిపిరైడ్, బీపీ ఔషధం టెల్మిసార్టాన్ కూడా ఉన్నాయి. మొత్తం 53 ఔషధాల్లో నాణ్యత లోపం కనిపించినట్టు తేలింది. నాణ్యతా లోపాలు ఉన్న ఈ ఔషధాలను ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్థాన్ యాంటీబయాటిక్స్, హెటిరో డ్రగ్స్, కర్నాటక యాంటీబయాటిక్స్ అండ్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్, మెగ్ లైఫ్‌సైన్సెస్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నట్టు కేంద్ర ఔషధ రంగ నియంత్రణ మండలి పేర్కొంది. ఈ ఔషధాల్లోనూ నాణ్యతా లోపాలు బయటపడటంతో మరింత అప్రమత్త, తనిఖీలు అవసరమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఔషధ రంగ నియంత్రణ సంస్థ పేర్కొన్న వివరాల ప్రకారం మెట్రోని డాజోల్‌ను ప్రభుత్వం రంగ సంస్థ హిందుస్థాన్ యాంటీబయా టిక్ లిమిటెడ్ తయారు చేసింది. షెల్‌కాల్‌ను ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్ సంస్థ సిద్ధం చేసింది. ఆల్కెమ్ సంస్థ రూపొం దించిన క్లావామ్, పాన్ డీల్లో లోపాలు ఎక్కువగా ఉన్నట్టు పరీక్షల్లో వెల్లడైంది. తీవ్ర ఇన్ఫెక్షన్ల బారిన పడ్డ చిన్నారులకు ఇచ్చే సీపోడెమ్ ఎక్స్‌పీ 50 డ్రై సస్పెన్షన్‌లో లోపాలు ఉన్నట్టు తేలింది. ఈ ఔషధాన్ని హెటిరో సంస్థ ఉత్పత్తి చేస్తోంది. కర్నాటక యాంటీబయాటిక్స్ ఉత్పత్తి చేసిన పారాసిటమాల్ లోనూ నాణ్యత సంబంధిత సమస్యలు ఉన్నట్టు బయటపడిరది.