. వైసీపీ పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయి
. పంట నష్టపోయిన వరి రైతులకు ఎకరాకు రూ.10 వేలు
. 17వ తేదీలోగా అన్ని రకాల నష్టపరిహారాలు పూర్తి
. కొల్లేరు, ఉప్పుటేరులో రెగ్యులేటర్ నిర్మాణానికి చర్యలు
. ఏలూరులో రైతులతో ముఖాముఖిలో సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర ప్రతినిధి`ఏలూరు :
గత ఐదేళ్ల వైసీపీ పాలన ప్రజలకు శాపాలుగా మారాయని, బుడమేరుకు గండ్లు పూడ్చకుండా వదిలివేయడం వల్లనే విజయవాడ నగరం వరద ముంపునకు గురయ్యిందని… బుడమేరు గండ్లు పూడ్చేందుకు యుద్ధమే చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. వరదల్లో నష్టపోయిన రైతులకు ఈ నెల 17వ తేదీలోగా నష్టపరిహారం అందజేస్తామని ప్రకటించారు. ముఖ్యంగా వరి రైతులకు హెక్టారుకు రూ.25 వేలు, ఎకరాకు రూ.10 వేల చొప్పున నష్టపరిహారం అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వరి, ఇతర పంటలు సాగు చేసేవారిలో అత్యధికంగా కౌలు రైతులే ఉన్నందున నష్టపరిహారం, ఇప్పుడు సబ్సిడీ నేరుగా కౌలు రైతుల బ్యాంక్ ఖాతాలకు చెల్లించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. తమ్మిలేరు, బుడమేరు వల్ల నష్టపోకుండా కొల్లేరు, ఉప్పుటేరు ప్రాంతాల్లో రెగ్యులేటర్ నిర్మాణానికి సాధ్యసాధ్యాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖను ఆదేశించామని అన్నారు. బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు సరస్సు, ఉప్పుటేరును పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు ఏలూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏరియల్ వ్యూ ద్వారా వాటిని పరిశీలించారు. అనంతరం ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద తమ్మిలేరు వరద ఉధృతిని పరిశీలించి, స్థానిక సీఆర్ రెడ్డి అటానమస్ కళాశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన రైతుల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన రైతులను పంట నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ బుడమేరు వాగు పరీవాహక ప్రాంతం ఆక్రమణలకు గురవడంతో నీరు సజావుగా వెళ్లేందుకు మార్గం లేక పది రోజుల పాటు విజయవాడ నగరం వరదలతో అతలాకుతలమైందని తెలిపారు. 2014 తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో బుడమేరు గండ్లు పూడ్చేందుకు రూ.57 కోట్లు మంజూరు చేయగా దానిని రాజకీయ కారణాలతో రద్దు చేశారని చెప్పారు. అనంతరం గత వైసీపీ ప్రభుత్వం ఆ గండ్లు పూడ్చకుండా వదిలేసిందని, అంతేకాకుండా బుడమేరు పరీవాహక ప్రాంతాలను ఆక్రమణలకు గురి చేశారని, తప్పుడు రిజిస్ట్రేషన్‌లతో అక్రమ కట్టడాలకు నాంది పలికారని ఆరోపించారు. మరోవైపు ప్రకృతి విపత్తు, అదే సమయంలో మానవ తప్పిదాల వల్ల భారీ వరదలు చవిచూడాల్సి వచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో డ్రెయిన్లలో, కాలువలలో పూడికలు తీయకపోవడం వంటి వైసీపీ చేసిన పాపాలు ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. ఎన్నడూ లేని విధంగా కృష్ణా నదికి 11.90 లక్షల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రావడం, మరోవైపు ఎడతెరిపిలేని కుండపోత వర్షం, ఇంకో వైపు బుడమేరు పొంగిపొర్లి విజయవాడ నగరాన్ని వరద నీరు పోటెత్తి ముంచెత్తడంతో ప్రజల పక్షాన యుద్ధం చేశామని చెప్పారు. ఐదు రోజుల పాటు మంత్రి రామానాయుడు, నీటిపారుదల శాఖ అధికారులు శక్తికి మించి పని చేసి బుడమేరుకు పడిన మూడు గండ్లు పూడ్చడం జరిగిందని, వారిని అభినందించారు. మరోవైపు, 50 టన్నులు కలిగిన 3 బోట్లు ఒకదానికొకటి ముడివేసి 11.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో వస్తున్న కృష్ణా నదిలో వదిలిపెట్టారని, ఆ బోట్లు నీటి వేగానికి 10.05 టన్నులు బరువున్న ప్రకాశం బ్యారేజ్ కౌంటర్ వెయిట్‌ను ఢీ కొట్టాయని అన్నారు. ఆ బోట్లు కౌంటర్ వెయిట్‌ను కాకుండా కాలంను ఢీకొని ఉంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీను చూసే వారం కాదని, ఎన్నో గ్రామాలు నీటి ముంపునకు గురయ్యేవని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ బోట్లపై వైసీపీ రంగులు వేసి ఉన్నాయని అన్నారు. ఈరోజు వరకు కూడా ఆ బోట్లు తమవేనని ఎవరూ చెప్పడం లేదని, వాటిని అక్రమ ఇసుక రవాణాకు వైసీపీ వినియోగించిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా సైతం ప్రజలకు ఆహారాన్ని అందిస్తే వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని తెలిపారు. నేరస్తులు రాజకీయాల్లోకి వస్తే ప్రజల జీవితాలు అతలాకుతలం అవుతాయని ఎద్దేవా చేశారు. విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో బురదలోకి దిగి తాను స్వయంగా తిరిగానని, తనతో పాటు అధికార యంత్రాంగం ఆగమేఘాలపై పనిచేసి సాధారణ పరిస్థితి తీసుకురావడానికి కృషి చేసిందని తెలిపారు. వ్యవసాయం, ఉద్యాన, పాడి పశువులు, గృహాలు వాటన్నింటికీ ఈ నెల 17వ తేదీలోగా నష్టపరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తి చేశామని, అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు కుంటుపడి డయాఫ్రం వాల్‌ను గోదావరిలో కలిపేసిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.12 వేల కోట్లు మంజూరు చేయించుకున్నామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని, వరదలు, తుపాను వచ్చినప్పుడు ప్రాణ, ఆర్థిక నష్టాలు జరగకుండా డ్రెయిన్లు, కాలువలకు మరమ్మతులు చేసి పూడికలు తీస్తామని స్పష్టం చేశారు. వరదలు వల్ల సాగునీటి సంఘాలు అందుబాటులోకి తీసుకురాలేకపోయామని, త్వరలోనే వీటికి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. పెదపాడు లోయర్ డ్రెయిన్‌కు మరమ్మతులు చేయిస్తామన్నారు. ముందుగా చంద్రబాబుకు కొల్లేరు వరద ముంపుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ వెట్రి సెల్వి వివరించారు.
ఏలూరులో బ్రిడ్జి నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు
తమ్మిలేరు వరద వల్ల ప్రతిసారి ముంపునకు గురై రాకపోకలకు ఇబ్బందిగా ఉన్న శనివారపు పేట కాజ్ వే వద్ద రూ.15 కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏలూరు పర్యటనకు బుధవారం వచ్చిన సీఎం చంద్రబాబుకు శనివారపేట కాజ్ వే వల్ల వరదల సమయంలో రాకపోకలు నిలిచిపోయి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య… సీఎంకు వేదిక మీద వివరించి బ్రిడ్జి నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని కోరారు. దీంతో సీఎం స్పందించి కాజ్ వే పై బ్రిడ్జి నిర్మాణానికి రూ.15 కోట్లు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించి, వెనువెంటనే పనులు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సెల్విని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కొలుసు పార్ధసారధి, డా. నిమ్మల రామానాయుడు, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), డా.కామినేని శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, కనుమూరి రఘురామ కృష్ణరాజు, నగర మేయర్ షేక్ నూర్జాహాన్ పెదబాబు, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఘంటా మురళీరామకృష్ణ, రామరాజు సర్. సిఆర్ రెడ్డి కళాశాల సంస్థల చైర్మన్ అల్లూరి ఇంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.