కోల్‌కతా: కమ్యూనిస్టు దిగ్గజ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య (80) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన గురువారం ఉదయం కోల్‌కతాలోని తన నివాసంలో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈమేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం వెల్లడిరచారు. భట్టాచార్య 2000-2011 వరకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయనకు భార్య మీరా, కుమారుడు సుచేతన్ ఉన్నారు. పెద్దాయన ఇకలేరన్న వార్తతో కుటుంబ సభ్యులు, అభిమానులు, సీపీఎం కార్యకర్తలు, నేతలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. బుద్ధదేవ్ సీపీఎంలో నిర్ణయాధికార విభాగం పొలిట్‌బ్యూరోలో కీలకంగా వ్యవహరించారు. కమ్యూనిస్టు యోధుడు జ్యోతిబసు తర్వాత 2000 సంవత్సరంలో బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2011లో జరిగిన ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. దీంతో క్రమంగా భట్టాచార్య ప్రజాజీవితం నుంచి దూరమయ్యారు. కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆరోగ్యం సరిగా లేదు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. బుద్ధదేవ్ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కాలేజ్ పూర్వ విద్యార్థి. ఆయన పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1977లో తొలిసారి కాశిపుర్-బెల్గాచియా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంచలంచెలుగా తన వృత్తి జీవితంలో ఎదిగిన బుద్ధదేవ్.. జ్యోతి బసు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2001, 2006లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయ తీరాలకు చేర్చారు. ఆయన అత్యంత సాధారణ జీవితాన్ని గడిపారు. బాలీగంజ్‌లోని చిన్న ఇంట్లోనే నివసించేవారు. సీఎంగానూ అక్కడి నుంచే విధులు నిర్వర్తించారు. ఇప్పుడు అక్కడే తుదిశ్వాస విడిచారు. భట్టాచార్య 1944, మార్చి 1న భట్టాచార్య ఉత్తర కోల్‌కతాలో జన్మించారు. 1966లో సీపీఎం ప్రాథమిక సభ్యుడయ్యాడు. 1968లో పశ్చిమ బెంగాల్ డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 1971లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, 1982లో సెక్రటేరియట్ సభ్యుడిగా.. 1984 నుంచి పార్టీ కేంద్ర కమిటీకి నిత్య అతిథిగా ఉన్నారు. 1985లో కేంద్ర కమిటీ సభ్యుడిగా.. 2000 నుంచి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేశారు. 1977లో కోసిపూర్ నుంచి తొలిసారిగా శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1987లో ఓడిపోయినా అదే ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి మంత్రి అయ్యారు. 1987-96 మధ్య కమ్యూనికేషన్స్ అండ్ కల్చర్ డిపార్ట్‌మెంట్‌ను మరియు 1996-99 వరకు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను నిర్వహించాడు. జూలై 2000లో ఉపముఖ్యమంత్రి అయ్యారు. అదే సంవత్సరం నవంబర్‌లో జ్యోతిబసు అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేయడంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. పశ్చిమ బెంగాల్ పారిశ్రామికీకరణపై ఆయన గట్టి వైఖరిని తీసుకున్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సంతాపం
బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల సీపీఎం కేంద్ర కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటనను విడుదల చేసింది. ‘అత్యుత్తమ కమ్యూనిస్టు నాయకుడు, మాజీ పొలిట్ బ్యూరో సభ్యుడు, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఈ ఉదయం 8.20 గంటలకు మరణించారని మేము తీవ్ర విచారంతో తెలియజేస్తున్నాము. ఆయనకు నివాళిగా ఎర్ర జెండాను అవనతం చేయనున్నాము’ అని పేర్కొంది. బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంతాపం వ్యక్తం చేశారు. బుద్ధదేవ్ భట్టాచార్య మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావం, ఆదర్శాలు , అతని ముందుచూపు ఎల్లప్పుడూ తమకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.
సీపీఐ జాతీయ సమితి సంతాపం
బుద్ధదేవ్ భట్టాచార్య మృతి పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జాతీయ సమితి తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓప్రకటన విడుదల చేసింది. కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య దేశంలోని సీపీఎం, వామపక్షాలకు చెందిన అత్యంత సీనియర్ నాయకులలో ఒకరు. ప్రజాజీవితంలో సుదీర్ఘ కాలం కొనసాగిన ఆయన… తన సేవలతో ప్రజల మన్ననలు పొందారు. చురుకైన, నిబద్ధత, అంకితభావంతో కూడిన కమ్యూనిస్టు రాజకీయవేత్త అయిన కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య… రచయితగా తన పద్యాలు, గద్యాలు, అనువాదాలతో బెంగాల్ సాహిత్యం, సంస్కృతి చరిత్రలను సుసంపన్నం చేశారు. ప్రఖ్యాత మేధావిగానూ గౌరవించబడ్డారు. బెంగాల్ సాహిత్య, సాంస్కృతిక రంగానికి ఆయన లేని లోటు పూడ్చలేనిది. కామ్రేడ్ బుద్ధదేవ్ భట్టాచార్య కుటుంబ సభ్యులకు, సీపీఎం పార్టీకి భారత కమ్యూనిస్టు పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలిపింది.