. అనేక రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన
. రైల్‌రోకోలు…. వాహనాల నిలిపివేత
. దళిత, ఆదివాసీ సంఘాల ప్రదర్శనలు… ధర్నాలు
న్యూదిల్లీ : భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. అనేక రాష్ట్రాల్లో నిరసనకారులు రోడ్ల పైకి వచ్చి దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు మూసివేయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అనేక చోట్ల రైల్‌రోక్ నిర్వహించారు. రిజర్వేషన్ల ప్రాథమిక సూత్రాలను దెబ్బతీసేలా ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా దళిత సంఘాలు, ఆదివాసీ సంస్థలు, మరికొన్ని రాజకీయ పార్టీలు సహా 21 సంస్థలు బంద్‌లో పాల్గొన్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు అనేక చోట్ల ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించాయి. అయితే సాధారణ జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. బంద్ నేపథ్యంలో రాష్ట్రమంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ), సమాజ్‌వాది పార్టీ (ఎస్‌పీ) బంద్‌కు మద్దతు తెలిపాయి. లక్నోలో బీఎస్‌పీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించడంతో హజ్రత్‌గంజ్, సమీపంలోని కీలక మార్గాల్లో ట్రాఫిక్ స్తంభించింది. అంబేద్కర్ చౌక్ వద్ద పెద్ద సంఖ్యలో బీఎస్‌పీ కార్యకర్తలు, మద్దతు దారులు ప్రదర్శన కోసం తరలివచ్చారు. ప్రయాగ్‌రాజ్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందిని మోహరించారు. ఆగ్రాలో నిరసనకారుల బృందం నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించింది. బీఎస్‌పీ కార్యకర్తలు ఎంజీ రోడ్డుపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి, కలెక్టరేట్ గేటు పైకి ఎక్కి నినాదాలు చేశారు. ఆందోళనకారులు జిల్లా మేజిస్ట్రేట్‌కు వినతి పత్రం అందించారు. కాన్పూర్, ఉన్నావ్, అలీఘర్, ముజఫర్‌నగర్, సంభాల్, జలౌన్, ఇటావా, మధుర, హత్రాస్, గోరఖ్‌పూర్‌లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. భీమ్ ఆర్మీ పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో నిరసనలు చేపట్టింది. రాజస్తాన్‌లో భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. కొన్ని జిల్లాల్లో దుకాణాలు, పాఠశాలలు మూతపడ్డాయి. భరత్‌పూర్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కొన్ని ప్రాంతాల్లో, తక్కువ బస్సులు అందుబాటులో ఉండటంతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. జైపూర్ వ్యాపార్ మహాసంఫ్‌ు ప్రధాన కార్యదర్శి సురేష్ సైనీ మాట్లాడుతూ నిరసనల కారణంగా దుకాణదారులకు, వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు నగరంలోని మార్కెట్ సంఘాలు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ సంయుక్త సంఘర్ష్ సమితి జైపూర్‌లో ర్యాలీ నిర్వహించింది. ఎస్సీల ఉప వర్గీకరణపై సుప్రీం తీర్పును నిరసిస్తూ దళితులు, ఆదివాసీ సంఘాలు నిర్వహించిన భారత్ బంద్ కారణంగా ఒడిశాలో రైలు, రోడ్డు మార్గాల్లో పాక్షికంగా అంతరాయం ఏర్పడిరది. బంద్ ఉన్నప్పటికీ ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు యథావిధిగా పని చేశాయి. నిరసనకారులు భువనేశ్వర్, సంబల్పూర్ స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. ప్రయాణికుల బస్సులను, భువనేశ్వర్ రైల్వే స్టేషన్‌లో విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను కొద్దిసేపు నిలిపివేశారు. కటక్, సంబల్‌పూర్, బోలంగీర్, మల్కన్‌గిరి, సుందర్‌ఘర్, కియోంజర్‌లతో సహా అనేక ప్రాంతాల్లో రహదారి దిగ్బంధనాలు జరిగాయి.
బీహార్‌లో పోలీసుల లాఠీఛార్జ్
భారత్ బంద్‌కు మద్దతుగా రైలు, రోడ్డు దిగ్బంధనం చేసిన నిరసనకారులను చెదరగొట్టడానికి బీహార్ పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. జల ఫిరంగులను ప్రయోగించారు. నిరసనకారులు దర్భంగా, బక్సర్ రైల్వే స్టేషన్లలో రైలు సేవలకు అంతరాయం కలిగించారు. పాట్నా, హాజీపూర్, దర్భంగా, జెహానాబాద్, బెగుసరాయ్ జిల్లాల్లో ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. దీంతో వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. పాట్నాలో డాక్ బంగ్లా చౌక్ వద్ద ట్రాఫిక్‌ను అడ్డుకున్న నిరసనకారులను తరిమికొట్టారు. జెహనాబాద్ జిల్లాలో ఉంటా చౌక్ సమీపంలోని జాతీయ రహదారి-83పై నిరసనకారులు, భద్రతా సిబ్బంది మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మాధేపురా, ముజఫర్‌పూర్, సరన్, బెగుసరాయ్, హాజీపూర్, పూర్నియాతో సహా ఇతర జిల్లాలలో నిరసనకారులు ట్రాఫిక్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. టైర్లను తగులబెట్టారు. దర్భంగా, బక్సర్ రైల్వే స్టేషన్లలో బీహార్ సంపర్క్ క్రాంతి, ఫరక్కా ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపివేశారు. గుజరాత్‌లో బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. నిరసనకారులు గూడ్స్ రైలు, రహదారులపై వాహనాలను అడ్డుకున్నారు. ఛోటా ఉదేపూర్, నర్మదా, సురేంద్రనాగ్రా, సబర్‌కాంత, ఆరావళి వంటి జిల్లాల్లో గిరిజన, దళిత సంఘాల ఆధిపత్యం ఉన్న ప్రాంతాలలో బంద్ ప్రభావం కనిపించింది. నగరాల్లో దుకాణాలు మూతపడ్డాయి. పంజాబ్, హర్యానాలో ఎస్సీ ఆధిపత్యం గల జలంధర్, హోషియార్‌పూర్ జిల్లాల్లో భారీ భద్రతా సిబ్బందిని మోహరించారు. నిరసనకు మద్దతుగా తమ దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసి ఉంచాలని కార్యకర్తలు వ్యాపారులను కోరడం కనిపించింది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ), భీమ్ ఆర్మీ, జై ఆదివాసీ యువ శక్తి సంఘటన్‌తో సహా వివిధ రాజకీయ, సామాజిక సంస్థల కార్యకర్తలు బంద్‌కు మద్దతుగా మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. భోపాల్, ఇండోర్ వంటి నగరాల్లో బంద్ ప్రభావం స్వల్పంగా కనిపించింది. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలతో పాటు దళితులు అధికంగా ఉండే ప్రాంతాలలో బలమైన ప్రభావం కనిపించింది. పంధుర్నా, మాండ్లా వంటి గిరిజన ప్రాబల్యం ఉన్న జిల్లాలలో మార్కెట్లు, సంస్థలు మూతపడ్డాయి. మొరెనా, దళితులు అధికంగా ఉండే భింద్ వంటి జిల్లాలలో భారీ ర్యాలీలు జరిగాయి.