. బదిలీపై వెళ్తూనే బేరసారాలు
. వీఎంఆర్డీఏ ప్రణాళికా విభాగంలో సెటిల్‌మెంట్లు
. రూ.కోట్లలో మూటగట్టిన కీలకాధికారి
విశాలాంధ్ర-విశాఖ: వీఎంఆర్డీఏ ప్రణాళికా విభాగంలో పనిచేసే ఓ కీలక అధికారి రూ. కోట్లలో బొక్కేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. తన బదిలీని నిలుపుదల చేసేం దుకు శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తన కిందిస్థాయి అధికారి, ఉద్యోగులతో కలిసి రెండు రోజుల వ్యవధిలోనే లేఅవుట్ డెవలపర్‌లతో మాట్లాడుకుని లక్షలాది రూపాయలు స్వాహా చేసినట్టు తెలిసింది. ప్రణాళికా విభాగంలో వేళ్లూనుకున్న అవినీతిని అంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్… సిఫారసులకు ఏమాత్రం తలొగ్గకుండా… ప్లానింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేస్తూ ఇటీవల పెద్ద ఎత్తున అధికారులు, సిబ్బందిని బదిలీ చేశారు. ఉత్తర్వులు జారీ అయినా… బాధ్యతల నుంచి రిలీవ్ కాకుండా రెండు రోజుల వ్యవధిలో వివిధ ఫైళ్లకు ఆమోద ముద్ర వేసి భారీగా వసూళ్లు చేసినట్లు తెలిసింది. నిబంధనలకు తూట్లు పొడిచి కొన్ని ఫైళ్లను ఆమోదించినట్లు విశ్వసనీయ సమాచారం. రాబోయే అధికారి వరకు ఆగడం ఎందుకు దండగ… తానే ఫైళ్లు క్లియర్ చేసేస్తానంటూ బేరసారాలు సాగించినట్టు ఆ విభాగంలో పనిచేసే కొందరు సిబ్బంది చెబుతున్నారు. సుమారు ఆరు ఫైళ్లపై సంతకాలు చేసినట్టు తెలిసింది. భారీగా డబ్బులు మూటగట్టినట్టు తెలిసింది. బదిలీ ఉత్తర్వులు వెలువడక ముందు శనివారం ఆయన సెలవులో ఉన్నారు. ఆదివారం బదిలీల ఉత్తర్వులు వెలువడ్డాయి. సోమ, మంగళ వారాల్లో సెలవులోనే ఉన్నారు. అమరావతిలో ఉండి బదిలీని నిలుపుదల చేసుకోవడానికి శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో నిబంధనల ఉల్లంఘన కూడా జరిగినట్టు చెబుతున్నారు. కొన్ని ఫైళ్లు మెట్రోపాలిటన్ కమిషనర్ ఆమోదానికి పంపినట్టు తెలిసింది.
ఆ ఒక్క ఫైల్… అరకోటి!
వీఎంఆర్డీఏ ఆనందపురం జోన్ పరిధిలో ఒక ఫైల్ క్లియర్ చేయడానికి కిందిస్థాయి అధికారి, ఉద్యోగుల కలిసి ఆ కీలక అధికారి అరకోటికి పైగా నొక్కేసినట్టు తెలిసింది. బేరసారాలు సాగించి 50 లక్షలు వరకు డిమాండ్ చేసినట్టు చెబుతున్నారు. మీది పెద్ద ఫైల్ … వచ్చే అధికారి దాకా ఎందుకు… నాకే సెటిల్ చేయండి అంటూ బేరమాడినట్టు తెలిసింది. దీంతో ఆ కంపెనీ ప్రతినిధులు కొంత తగ్గించి బేరాన్ని సెటిల్ చేసుకున్నట్టు సమాచారం. సుమారు మూడున్నర ఎకరాల స్థలంలో బహుళ అంతస్తుల నిర్మాణానికి సెటిల్‌మెంట్ జరిగినట్టు తెలిసింది. కీలక అధికారితోపాటు బదిలీ అయిన మరో కిందిస్థాయి అధికారి, మిగతా ఉద్యోగులు ఈ ఫైల్ విషయంలో భారీగా ముట్టినట్టు చెబుతున్నారు.
ఎంసీ చర్యలు ఫలితాన్నిచ్చేనా?
వీఎంఆర్డీఏ ప్రణాళిక విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు మెట్రోపాలిటన్ కమిషనర్ (ఎంసీ) గట్టి చర్యలు చేపట్టారు. ప్రణాళిక విభాగంలోకి బయటివారిని రానివ్వడం లేదు. విజిటింగ్ అవర్స్ లో బయట వ్యక్తులు వచ్చినా నేరుగా సీయూపీనే కలవాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో ప్రణాళిక విభాగం ప్రక్షాళన అవుతుందని ఆయన భావించారు.
దీనివల్ల అవినీతి మరింత పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశాలు లేవు. ప్రణాళిక విభాగంలో ప్రతి సీటుకీ ఫైలు గురించి వివరించి డబ్బులు ఇస్తేనే పని జరగని పరిస్థితుల్లో ఈ ఆదేశాల వల్ల డెవలపర్లకు మరింత ఇబ్బంది తప్ప ఎటువంటి ఉపయోగం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. నిజానికి ప్రతి ఒక్కరూ సీయూపీ ని మాత్రమే కలవాల్సిన పరిస్థితి ఉంటే ఫైళ్లలో మరింత జాప్యం జరుగుతుంది. ప్రణాళిక విభాగానికి ఎవరినీ రానివ్వకపోవడం అధికారులకు మరింత మంచిది. బేరసారాలు బయటే జరుగుతాయని చెబుతున్నారు.