. వంద రోజుల పనితీరుపై నివేదిక సిద్ధం
. నేడు మంత్రివర్గ భేటీలో వెల్లడిరచే అవకాశం
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్ర మంత్రుల్లో ఆందోళన నెలకొంది. ఎందుకంటే బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి వివరాలు వెల్లడిరచనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఈనెల 18వ తేదీ నాటికి 100 రోజులు పూర్తవుతోంది. ఈ వంద రోజుల్లో మంత్రుల పనితీరు ఎలా ఉంది ? శాఖలపై వారు పట్టు పెంచుకున్నారా ? సమర్థంగా పనిచేస్తున్నారా ? సకాలంలో శాఖాపరమైన సమీక్షలు నిర్వహిస్తున్నారా ? ఆయా శాఖల్లో జరిగే లోటుపాట్లపై తక్షణమే స్పందిస్తున్నారా ? ప్రభుత్వ విధానాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో వారి స్పందన ఎలా ఉంది ? అలాగే ప్రతిపక్షం చేసే విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రుల వ్యవహార శైలి ఎలా ఉంటోంది ? తదితర అంశాలపై ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రోగ్రెస్ రిపోర్టు సిద్ధం చేశారు. గత సమావేశంలోనే చంద్రబాబు మంత్రుల పనితీరుపై పాయింట్లు ఇస్తానని తెలిపారు. జనసేన పార్టీకి సంబంధించిన మంత్రుల పనితీరుపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అందజేస్తానని తెలియజేశారు. పనితీరు సక్రమంగా లేకుంటే సరిచేసుకోవాలని, లేనిపక్షంలో చర్యలకు వెనుకాడబోమని కూడా చంద్రబాబు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జరుగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి హాజరుకానున్న మంత్రుల గుండెల్లో అలజడి రేగుతోంది. కేబినెట్‌లో తీసుకునే నిర్ణయాల కంటే తమ పనితీరుపై సీఎం ఏం చెప్పబోతున్నారనే దానిపైనే వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇటీవల కృష్ణా నదికి వచ్చిన భారీ వరద, ఉప్పొంగిన బుడమేరుతో విజయవాడ నగరంలోని సగం డివిజన్లు ముంపుకు గురైన నేపధ్యంలో వివిధ శాఖల మంత్రులు, శాసనసభ్యులు, అధికారుల పనితీరును కూడా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. వరద వచ్చిన దగ్గర నుంచి తగ్గేవరకు దాదాపు 10 రోజులపాటు చంద్రబాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్‌లోనే ఉండి బాధితులకు సహాయకచర్యలు వేగవంతంగా అందేలా కృషి చేశారు. సీఎంతో పాటు మున్సిపల్ మంత్రి పి.నారాయణ, జల వనరుల శాఖా మంత్రి రామానాయుడు, విద్యుత్‌శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ తదితరులు తీవ్రంగా శ్రమించి బాధితుల ప్రశంసలందుకున్నారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేతలో రామానాయుడు జోరువానలోనూ రేయంబవళ్లు కట్టపైనే ఉండి మరమ్మతు పనులు శరవేగంగా పూర్తి చేయించారు. అలాగే మంత్రి నారాయణ ముంపు ప్రాంతాల్లో వరద నీటిని తొలగించడంలో, ఫైర్ ఇంజన్ల ద్వారా ఇళ్లను, రోడ్లను శుభ్రం చేయించడంలో, పారిశుధ్య పనులు వేగవంతంగా చేయించడంలో, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, మున్సిపల్ కుళాయిల పునరుద్దరణ వంటి చర్యలు చేపట్టడంలో నిర్విరామ కృషి చేశారు. విద్యుత్ శాఖామంత్రి గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ సమస్యలు పరిష్కరించడంలో, వరద నీరు తగ్గగానే కరెంట్ సౌకర్యాన్ని పునరుద్ధరించడంలో అద్భుత పనితీరును కనబరిచారు. ఆరోగ్యశాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ వరద ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా సత్వర చర్యలు తీసుకున్నారు. ఇక ఎన్యూమరేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో, బాధితులకు కష్టకాలంలో సహాయక చర్యలు సత్వరమే అందేలా చర్యలు తీసుకోవడంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.స్పృజనతో పాటు, మరికొందరు అధికారులు అంకితభావంతో సేవలందించారు. వీరందరినీ మంత్రివర్గ సమావేశంలో ప్రశంసించే అవకాశాలున్నాయి. జనసేన మంత్రుల గ్రాఫ్‌ను పవన్ కల్యాణ్‌కు అందజేయనున్నారు. అనంతరం మంత్రులు తమ పనితీరు మెరుగుపర్చుకునే దిశగా చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న నూతన మద్యం విధానంపై కూడా ఈసమావేశంలో చర్చించనున్నారు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం తమ ప్రతిపాదనలు సమర్పించనుంది. అదేవిధంగా బాధితులకు అందజేసే నష్టపరిహారం, రాజధాని నిర్మాణపనులు, వరద నష్టంపై కేంద్ర సహాయం తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి.