. 9వరకు స్వీకరణ
. రెండేళ్ల కాలపరిమితితో దుకాణాల కేటాయింపు
. నూతన విధానం అమలుకు శ్రీకారం
. భారీగా పెరిగిన లైసెన్స్ ఫీజులు
. 11న లాటరీ ద్వారా ఎంపిక
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : నూతన మద్యం పాలసీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీకి మంగళవారం ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 9వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో తీసుకుంటారు. 11వ తేదీన ఆయా జిల్లా కలెక్టర్ల అధ్వర్యంలో లాటరీ ద్వారా మద్యం దుకాణాలను కేటాయిస్తారు. 12 నుంచి మద్యం దుకాణాలు ప్రారంభించుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాది 12 నుంచి 2026 సెప్టెంబరు 30 వరకు మద్యం దుకాణాల లైసెన్స్‌లు అమలులో ఉంటాయి. లాటరీలో లైసెన్స్ దక్కించుకున్న వ్యాపారులు ఒక రోజు వ్యవధిలో మొదటి విడత లైసెన్స్ ఫీజు చెల్లించాలన్న నిబంధన విధించారు. సెప్టెంబరు 30వ తేదీతో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ (ఏపీఎస్‌బీసీఎల్) ప్రభుత్వ దుకాణాల పాలసీ గడువు ముగిసింది. నూతన మద్యం పాలసీ వచ్చేంత వరకు గత ప్రభుత్వ విధానమే కొనసాగనుంది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 3,396 ప్రైవేట్ దుకాణాలను కేటాయిస్తున్నారు. ఈ పాలసీ పూర్తయ్యాక, గీత కార్మికులకు రిజర్వ్ చేసిన మరో 340 షాపులకు ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇస్తారు. ఈ దుకాణాలకు అదనంగా ప్రీమియం బ్రాండ్లు విక్రయించేందుకు 12 ఎలైట్ షాపులకూ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ అవుతాయి. విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురంలో ఏర్పాటు చేశారు. ఎలైట్ స్టోర్లకు ఐదేళ్ల కాల పరిమితి ఉంటుంది. మద్యం దుకాణాల దరఖాస్తు రుసుం రూ.2 లక్షలు (నాన్ రిఫండ్‌బుల్) నిర్ణయించారు. ఒక వ్యక్తి ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఈ మొత్తం ప్రక్రియ విధి విధానాలను ఏపీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా పర్యవేక్షిస్తున్నారు.
5 లక్షల జనాభా దాటితే…
85 లక్షల లైసెన్స్ ఫీజు
ఈ విడత మద్యం లైసెన్స్ ఫీజులను భారీగా పెంచారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురం పట్టణాల్లో 12 ప్రీమియం దుకాణాలు ఏర్పాటు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. జనాభా ప్రాతిపదికన మద్యం దుకాణాలను నాలుగు కేటగిరీలుగా విభజించారు. 10 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో 55 లక్షలు, 50,001 నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాల్లో లైసెన్స్ ఫీజు రూ.65 లక్షలుగా నిర్ధారించారు. 5 లక్షలు దాటిన నగరాల్లో గరిష్ఠ ఫీజు రూ.85 లక్షలుగా నిర్ణయించారు.
లైసెన్స్ ఫీజులతో పాటుగా వారికి ఇచ్చే మార్జిన్‌ను ఈసారి రెట్టింపు చేశారు. రెండో ఏడాది రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్‌పై పది శాతం పెంపుదలకు ప్రతిపాదించారు. 12వ తేదీ నుంచి ప్రైవేట్ మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. దసరా పండుగకు ముందే నూతన మద్యం పాలసీ అమలులోకి వచ్చేలా చర్యలు చేపడుతున్నారు. టెంపుల్ సిటీ తిరుపతిలో ప్రీమియం షాపులను కేటాయించలేదు. ఈ నూతన పాలసీ ద్వారా రూ.99కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి రావడంతో మద్యం ప్రియులకు శుభవార్త కానుంది.
ప్రభుత్వ మద్యం దుకాణాలు మూత
నూతన మద్యం పాలసీ అమలులోకి రావడంతో ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ అధ్వర్యంలో నడుపుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు మూతపడ్డాయి. సెప్టెంబరు 30వ తేదీతో ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల కాల పరిమితి పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లోని సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలంటూ షాపులు మూసివేసి నిరసన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో మద్యం షాపులు మూతపడ్డాయి. అక్టోబరు 1 నాటికి తమ ఐదేళ్ల కాంట్రాక్టు ముగిసిందని వారు దుకాణాలను మూసివేసి నిరసనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి, కుటుంబాలను ఆదుకోవాలని తిరువూరులో ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ వెల్ఫేర్ అధ్వర్యంలోని మద్యం షాపుల సూపర్ వైజర్లు, సేల్స్‌మేన్లు నిరసనకు దిగారు. మరో పది రోజులపాటు వైన్‌షాపులు తెరుస్తామని, ఆ సమయంలో ఉద్యోగులు పనిచేయాలని ప్రభుత్వం కోరగా, కొన్ని చోట్ల సిబ్బంది వెనక్కి తగ్గారు. మద్యం కావాలంటే మందు ప్రియులు బార్లకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మద్యం దుకాణాల కంటే… బార్లలో మద్యం ధరలు అధికంగా ఉంటాయి. ఈనెల 12వ తేదీన ప్రైవేట్ దుకాణాలు తెరిచేంత వరకు మందుబాబులకు మద్యం ప్రియంగా మారనుంది.
నేడు మహిళా ఐక్యవేదిక ధర్నా
మద్యం దుకాణాలను ప్రైవేట్‌కు కేటాయించడాన్ని, నూతన మద్యం పాలసీ విధానాన్ని నిరసిస్తూ మహిళా సంఘాల ఐక్య వేదిక అధ్వర్యంలో బుధవారం విజయవాడ లెనిన్ సెంటర్‌లో ధర్నా చేపట్టనుంది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు దీనికి హాజరవుతారు. ఈ ధర్నాలో వేదిక నేతలు పి.దుర్గాభవాని, డి.రమాదేవితో పాటు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొంటున్నారు.