. నూతన మద్యం విధానం సవరించాలని డిమాండ్
. 15లోగా స్పందించకుంటే… ఆందోళన తప్పదని హెచ్చరిక
విశాలాంధ్ర – విజయవాడ : మద్య పానాన్ని నిషేధించక పోగా మరింత ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా మద్యం దుకాణాలు పెంచుతారా? రూ.99లకే క్వార్టర్ మద్యం అందిస్తూ… మద్య పానాన్ని మరింతగా ప్రోత్సహిస్తారా? అంటూ మహిళా సంఘాలు ధ్వజమెత్తాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన విధానంలో సవరణలు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ విషయమై మహిళా సంఘాల ఐక్యవేదిక అధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీ 155వ జయంతి పురస్కరించుకుని బుధవారం స్థానిక లెనిన్ సెంటర్ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ), అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), మహిళా కాంగ్రెస్, ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవానీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని సంఫీుభావం తెలిపారు. రైతు నాయకుడు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రజల్ని మద్యం మత్తులో ఉంచే దిశగా మద్యం పాలసీని గాంధీ జయంతి రోజు నుండే అమలు చేయడం సిగ్గుచేటన్నారు. దీనిపై మహిళా లోకానికి ఏ సమాధానం చెబుతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం పెడ మార్గంలో వెళుతోందన్నారు. ఒక వైపు విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం కాకుండా ప్రజలు పోరాటం చేస్తుంటే దాన్ని పక్కదారి పట్టిస్తూ సనాతన ధర్మం పేరుతో భావోద్వేగాలను రెచ్చగొ డుతూ లడ్డూ రాజకీయం చేస్తున్నారని మండిప డ్డారు. సీపీఎం రాష్ట్ర నాయకులు యు.ఉమామహే శ్వరరావు మాట్లాడుతూ మద్యం నియంత్రిస్తామని మరింతగా అమ్మకాలు పెంచటం దుర్మార్గం అన్నారు. యువతను మద్యం మత్తులో ఉంచి తమ పబ్బం గడుపుకుందామనే ఆలోచనలో పాలకులు ఉన్నారని విమర్శించారు. దీనిపై మహిళాలోకం ఐక్యంగా పోరాటాలు సాగించాలన్నారు. ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవానీ, ఐద్వా ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి, మహిళా కాంగ్రెస్ పార్టీ నాయకులు సుంకర పద్మశ్రీ, పీఓడబ్ల్యూ కార్యదర్శి పి.పద్మ మాట్లాడుతూ రాష్ట్రంలో 2,600 మద్యం షాపులు పెంచడం, ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు ఇవ్వడం… లైసెన్సు ఫీజులు ద్వారా ప్రభుత్వానికి రెండు వేల కోట్ల ఆదాయం రావడం వంటివి చూస్తూ ఉంటే ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూస్తూ పేద ప్రజల జీవితాలను మరింత చీకటి మయం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత మద్యానికి బానిసై తప్పుడు మార్గంలో వెళ్లడం, రాష్ట్రంలో అనేక నేరాలకు కారణం మద్యం అని తెలిసి కూడా మద్యాన్ని నియంత్రించకుండా… మరింతగా అమ్మకాలు పెంచడం, పైగా నాణ్యమైన మద్యాన్ని క్వార్టర్ 99 రూపాయలకే అంటూ ప్రకటన చేయడం సరైంది కాదన్నారు. నాణ్యమైన మద్యం ప్రజల ప్రాణాలు తీయదా? మహిళపై హింసకు కారణం కాదా ?అని ప్రశ్నించారు. మద్యం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్గించే ప్రచారం చేపట్టి అంచెలంచెలుగా మద్యాపాన నియంత్రణ, నిషేధం చేయాలని సూచించారు. మద్యం నూతన విధానంపై మహిళా సంఘాలతో, అన్ని వర్గాలతో చర్చించి తుది నిర్ణయం చేయాలని, రాష్ట్ర ముఖ్యమంత్రిని, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిని కలవడానికి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ నెల 15 లోపు ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోకపోతే 16వ తేదీ నుండి ప్రత్యక్ష ఆందోళనలు సాగిస్తామని హెచ్చరించారు. మద్యం ద్వారా వచ్చే ఆదాయం నుండే మద్యానికి బానిసలై మరణించిన వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని, గతంలో మాదిరిగా డ్రై డే పెట్టాలని , తాగుబోతులను గుర్తించి డీ`అడిక్షన్ కేంద్రాల ద్వారా వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. మద్యం అమ్మకాలను ప్రభుత్వ నియంత్రణలో ఉంచుతూ సమయాన్ని కూడా గతంలో ఉన్నట్టుగా ఉదయం 11 నుండి రాత్రి 8 వరకు మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు. విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో ప్రభుత్వ నియంత్రణలో ఉండే మద్యం, నేడు ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో సిండికేట్ల చేతుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ, ఆర్ రవీంద్రనాథ్ (ఏఐటీయూసీ), పి.జమలయ్య (కౌలు రైతు సంఘం), డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, సుబ్బరావమ్మ (శ్రామీక మహిళా సంఘం) వై.కేశవరావు (రైతుసంఘం) మోతుకూరి అరుణకుమార్ (అరసం), మహిళా సమాఖ్య ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి బంకా రaాన్సీ, మాజీ కార్పొరేటర్లు కే శ్రీదేవి, ఆదిలక్ష్మి, సరోజ, సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, మహిళా సమాఖ్య విజయవాడ నగర అధ్యక్షురాలు ఓర్సు భారతి, యువజన సమాఖ్య నాయకులు గోవింద రాజులు, భార్గవ్, లంకె సాయి పాల్గొని సంఫీుభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పి చంద్రనాయక్, ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, కోశాధికారి ఆర్ పిచ్చయ్య, రాష్ట్ర నాయకులు ఎస్‌కే. నజీర్‌లు, మధ్య నియంత్రణ కోరుతూ అభ్యుదయ గేయాలు ఆలపించారు. తొలుత గాంధీజీ చిత్ర పటానికి పూల దండలు వేసి నివాళులు అర్పించారు. నూతన మద్యం విధానం పై సవరణలు చేయాలని, ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకులు డి.సీతారావమ్మ, చింతాడ పార్వతి, మూలి ఇందిర, డి.రమణమ్మ, అనిత తదితరులు పాల్గొన్నారు.