. ఉపరితల ఆవర్తన ప్రభావం
. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
. ఐఎండీ హెచ్చరిక… జనం బెంబేలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వందేళ్ల చరిత్రలో ఎన్నడూలేనంత ఉపద్రవం నుంచి బెజవాడ ప్రజలు ఇంకా తేరుకోకముందే వాతావరణశాఖ మళ్లీ పిడుగులాంటి వార్త చెప్పింది. మరో ముప్పు పొంచి ఉందంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఏపీకి మరలా భారీ వర్ష సూచన ఉందని ప్రకటించింది. పశ్చిమ, వాయువ్య బంగాళాఖాతం అనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారానికి అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిరచింది. ముఖ్యంగా.. పల్నాడు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంలో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని చెప్పారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.ఆగస్టు 31, సెప్టెంబరు 1వ తేదీన కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయింది. బుడమేరు, మున్నేరు వరదతో కృష్టమ్మ జల ప్రళయం సృష్టించింది. రికార్డుస్థాయిలో ప్రకాశం బ్యారేజీ వద్ద సుమారు 12 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదలైంది. 125 సంవత్సరాల చరిత్రలో ఇంత భారీస్థాయి నీటి విడుదల ఇదే మొదటిసారని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. దీంతో విజయవాడ సహా పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు, తెలంగాణ రాష్ట్ర్రంలో కూడా భారీ వర్షాలు కురవడం, ఖమ్మం జిల్లాలో దాదాపు 30 చెరువులకు గండ్లు పడడంతో బుడమేరు ఉప్పొంగింది. దీంతో దానికి దిగువనున్న ఇళ్లన్నీ నీట మునిగిపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు. కనీసం తినడానికి తిండి లేక నానా అవస్థలు పడ్డారు. ఇప్పటికీ అనేక ప్రాంతాలు వరదలోనే ఉన్నాయి. అయితే బుధవారం వరద ఉధృతి తగ్గడం, వాన లేకపోవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే వాతావరణ శాఖ మరోసారి హై అలర్ట్ ప్రకటించడం, ఇంకోవైపు బుడమేరులో వరద ప్రవాహం పెరుగుతుందని వార్తలు రావడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. బుడమేరుకు మూడు చోట్ల గండ్లు పడినట్లు గుర్తించారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఒక చోట గండిని పూడ్చే ప్రక్రియ సాయంత్రానికి చివరి దశకు వచ్చింది. మిగిలిన రెండు గండ్లను యుద్ధప్రాతిపదికన పూడ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు నారా లోకేశ్, రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బుడమేరు ప్రాంత ప్రజలకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రజలు పుకార్లు నమ్మవద్దని, ఎగువ ప్రాంతంలో వరద వస్తే ముందే సమాచారం ఇస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన ప్రజలకు ధైర్యం చెప్పారు.