అమరావతి రాజధానిపై కేంద్రం వైఖరేంటి?
విశాఖ ఉక్కుపై పవన్ డిమాండును స్వాగతిస్తున్నాం
పవన్… మోదీ, అమిత్‌షా వద్దకు తీసుకెళ్లండి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్రను ఆదరించాలని రాష్ట్ర ప్రజలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. విజయవాడ దాసరిభవన్‌లో సోమవారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. పాదయాత్రకు సీపీఐ సంపూర్ణ మద్దతిస్తోందని రామకృష్ణ పునరుద్ఘాటించారు. అమరావతి రైతులు, మహిళల రెండేళ్ల చారిత్రక ఉద్యమానికి మహా పాదయాత్ర మరో మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. 45 రోజులు జరిగే మహాపాదయాత్రకు ప్రజలు నీరాజనం పలకాలని కోరారు. రాజధాని అంశంపై 685 రోజులు జరిగిన ఉద్యమం దేశంలో ఎక్కడా లేదని, ఇది చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని కొనియాడారు. అమరావతి రాజధాని పరిరక్షణ జేఏసీ చేస్తున్న ఉద్యమాలకు, పాదయాత్రకు వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించాయని గుర్తుచేశారు. వైఎస్ జగన్ ఎన్నికల ముందు అమరావతి రాజధానికి అనుకూలంగా మాట్లాడారని, 30 వేల ఎకరాల భూమి కావాలని వ్యాఖ్యానించారని, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులను సీఎం జగన్ ప్రకటించి, ఏపీకి అసలు రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితికి తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ సీఎం ప్రకటించాలని డిమాండు చేశారు. అమరావతి రాజధానిపై బీజేపీ నేతలు ద్వంద్వ వైఖరిని విడనాడాలని, అమరావతి రాజధానిపై కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని డిమాండు చేశారు. రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ సుదీర్ఘకాలంగా కార్మిక సంఘాల నేతృత్వాన ఆందోళనలు కొనసాగుతున్నాయని, వాటికి అన్ని రాజకీయ పక్షాలు సైతం సంఫీుభావం తెలుపు తున్నాయన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్యమానికి జనసేన నేత పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించడాన్ని స్వాగతించారు. వైసీపీ ఎంపీలు అలంకార ప్రాయంగానే ఉన్నారని, పార్లమెంటులో స్పందించడం లేదంటూ పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. వాస్తవంగా రాష్ట్రానికి చెందిన మొత్తం 25 మంది లోక్‌సభ, 12 మంది రాజ్యసభ సభ్యులు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధాని మోదీకి వినతి పత్రం ఇచ్చిన దాఖలాలు లేవని మండిపడ్డారు. ఎన్నికల ముందు 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేస్తానని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక ఆయన మాట మార్చారని, వాటిని పక్కన పెట్టేశారని మండిపడ్డారు. కనీసం విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం కాకుండా తన ఎంపీలతో కేంద్రంపైన, పార్లమెంట్‌లోనూ ఒత్తిడి తేవకపోవడం దారుణమన్నారు. పవన్ కల్యాణ్ డిమాండు మేరకు సీఎం జగన్ వారం రోజుల్లోగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి…ప్రధాని దగ్గరకు తీసుకెళ్లాలన్నారు. సీఎం వారం రోజుల్లోగా స్పందించకుంటే…ఆ బాధ్యతను పవన్ కల్యాణ్ తీసుకోవా లని, కుని, అఖిలపక్షాన్ని మోదీ, అమిత్‌షా దగ్గరకు తీసుకెళ్లాలని సూచించారు. నాడు ప్రత్యేక హోదా ఉద్యమంలో తాను ఒంటరినయ్యానని, తనకు జనబలం ఉన్నా..చట్టసభల్లో బలం లేదని పవన్ చేసిన వ్యాఖ్యల్ని రామకృష్ణ తోసిపుచ్చారు. ఒక ఉద్యమంలోకి వచ్చినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమంలో ఎవరూ ఒంటరి వారు కాబోరని, అన్ని రాజకీయ, కార్మిక సంఘాలు, ప్రజల మద్దతు ఈ ఉద్యమానికి ఉందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కేంద్రం అనుసరిస్తున్న ప్రైవేటీకరణ విధానాలతోనే ఏపీలో వరుస వారీగా ప్రభుత్వ రంగ సంస్థలను, పోర్టులను ప్రైవేట్‌పరం చేస్తున్నారన్న విషయాన్ని పవన్ గమనించాలన్నారు.
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు మాట్లాడుతూ విశాఖ ఉద్యమం సుదీర్ఘకాలం నుంచి కొనసాగుతోందన్నారు. నాడు సీపీఐ అధ్వర్యంలో ప్రత్యేక హోదా కోసం 13 జిల్లాల్లో పెద్దఎత్తున ఉద్యమం జరిగిందని, అదే తరహాలో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉద్యమం కొనసాగుతోందని వివరించారు. కేంద్రానికి జగన్, చంద్రబాబు భయపడినట్లే, పవన్ కూడా భయపడితే ఆయన ఉద్యమాలు చేయలేరన్నారు. విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.