. గుడికి వెళ్తానంటే… మతం అడుగుతారా..?
. మాజీ ముఖ్యమంత్రికే ఈ పరిస్థితా ?
. ఏపీలో రాక్షస పాలన
. వైసీపీ అధినేత జగన్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దేవుడి గుడికి వెళ్దామని అనుకుంటే..నీదే మతం అని అడుగుతున్నారు…ఒక మాజీ ముఖ్యమంత్రికే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక దళితుల పరిస్థితి ఏంటని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. తిరుమలకు నేను వెళ్లకూడదని నోటీసులు పంపారని, ఒక సీఎంగా ఐదేళ్లపాటు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తాను తిరుమలకు వెళ్లకూడదా? అని ధ్వజమెత్తారు. జగన్ తిరుమల పర్యటన రద్దు అనంతరం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రాజ్యాంగంలోని సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసా ?, అని కూటమి నేతలను ప్రశ్నించారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. హిందూయిజానికి తామే ప్రతినిధులమని బీజేపీ చెప్పుకుంటుందని, ఇప్పుడు మీ కూటమిలోని ఓ వ్యక్తి తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తుంటే… ఎందుకు మందలించడం లేదని నిలదీశారు. చంద్రబాబును మీరెందుకు వెనకేసుకు వస్తున్నారు?, ఇదేం హిందూత్వం అని మండిపడ్డారు. హిందూయిజం అంటే అర్థం…మంచి చేసేదని జగన్ వివరించారు. నా కులం, మతం ఏమిటో ప్రజలకు తెలియదా? అన్నారు. నా మతం మానవత్వం అని, ఇదే డిక్లరేషన్‌లో రాసుకుంటే రాసుకోండని సూచించారు. ఇంట్లో నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని, బయటకు వెళ్తే హిందూ, ఇస్లాం, సిక్కు మతాలను గౌరవిస్తానని తెలిపారు. మానవత్వం చూపడమే హిందూయుజమని, చెడు చేసే వారిని నేను మంచి హిందూవుగా గుర్తించబోనని జగన్ స్పష్టంచేశారు. గతంలో నా పాదయాత్ర ముగిశాక స్వామి వారిని దర్శించుకున్నానని, నేను సీఎం అయ్యాక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించానని గుర్తుచేశారు. నన్ను గుడికి పంపకపోయినా…వైసీపీ శ్రేణులు గుడికి వెళ్లి చంద్రబాబు తప్పుచేశాడని, తాము కాదని దేవుడికి చెప్పాలని కోరారు. గతంలో నా తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఐదేళ్లు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారని గుర్తుచేశారు. నేను ఆయన కొడుకుని కాదా? నన్ను ఎందుకు గుడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని అని ప్రశ్నించారు. నేను కూడా అనేకసార్లు తిరుపతికి వెళ్లి కాలినడకన కొండ ఎక్కి స్వామి వారిని దర్శించుకున్నానని చెప్పారు. అప్పుడూ చంద్రబాబు ప్రభుత్వమే ఉందనీ గుర్తుచేశారు. ఇప్పుడు తిరుమలకు తాను వెళ్లకూడదంటూ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు. లడ్డూ కల్తీ జరిగిందంటూ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగారని, ఇప్పుడు తాను తిరుమల పర్యటనకు వెళ్తుంటే… ఉన్న పళంగా డిక్లరేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చి మరో డైవర్షన్ పాలిటిక్స్‌కు దిగారని దుయ్యబట్టారు. తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు. చంద్రబాబు తప్పుచేసి, ఆయనే సిట్ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. చంద్రబాబు పాపాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయని, రాజకీయాల కోసం హిందూ మతాన్ని వాడుకుని కుతంత్రం చేస్తున్నారని జగన్ ఆరోపించారు. ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని, దేశంలో ఎక్కడాలేని పరిస్థితులు రాష్ఠ్రంలో చోటు చేసుకుంటున్నాయని జగన్ ధ్వజమెత్తారు.
జగన్ తిరుమల పర్యటన రద్దు
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దయింది. ముందస్తు షెడ్యూలు ప్రకారం శుక్రవారం సాయంత్రం ఆయన తిరుమలకు బయల్దేరాల్సి ఉంది. శనివారం ఉదయం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకోవాలి. జగన్ పర్యటనను కూటమి పార్టీలు, హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ పర్యటన రద్దు కావడం చర్చానీయాంశంగా మారింది. జగన్ డిక్లరేషన్ ఇస్తేనే గుడిలోకి అడుగుపెట్టాలని హిందూ సంఘాలు సహా, కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అటు వైసీపీ ముఖ్యనేతలను హౌస్ అరెస్టులు చేసి…వారికి నోటీసులు జారీజేశారు. తిరుపతి ఎయిర్‌పోర్టు వద్ద భారీగా పోలీసు బలగాలు మొహరించారు. దీంతో శాంతి భద్రతల సమస్య తలెత్తితే జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందనే ఆలోచనతో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. ముందుగా ప్రకటించిన ప్రకారం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో వైసీపీ శ్రేణులు పూజలు నిర్వహించనున్నారు.