ఐసీఎంఆర్ సైంటిస్ట్ అంచనా
మార్చినెల కల్లా కరోనా మహమ్మారి ఎండమిక్ స్టేజికి చేరుకుంటుందని ఐసీఎంఆర్ ఎపిడెమియోలాజిస్ట్ డి సమీరన్ పాండా వెల్లడిరచారు. మనం అజాగ్రత్త వహించకుండా ఉంటే.. డెల్టాను ఒమిక్రాన్ అధిగమిస్తే.. కొత్త వేరియంట్లేవి ఉద్భవించకపోతే మార్చి 11 నాటికి కోవిడ్ సాధారణ ఫ్లూగా మారుతుందని సమీరన్ చెప్పుకొచ్చారు. నిపుణుల అంచనా ప్రకారం.. దేశంలో డిసెంబర్ 11 నుంచి ప్రారంభమైన ఒమిక్రాన్ వేవ్.. మూడు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది. ‘మార్చి 11 తర్వాత కరోనా నుంచి ఉపశమనం పొందొచ్చు. అలాగే దిల్లీ, ముంబైలో కరోనా గరిష్ట స్థాయికి చేరాయా.? లేదా.? అనే విషయం తెలియాలంటే మరో రెండు వారాలు వేచి చూడాలి. అక్కడ కేసులు, పాజిటివిటీ రేటు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ..ఇప్పుడే ఒక అభిప్రాయానికి రాలేం.’ అని ఆయన తెలిపారు. దిల్లీ, ముంబైలో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కేసులు సుమారుగా 80:20 నిష్పత్తిలో ఉన్నాయన్నారు. కరోనా వైరస్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్థాయిలో ఉందని, దానికి తగ్గట్టే ఐసీఎంఆర్ పరీక్షా వ్యూహాలు మారుస్తుందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం సృష్టిస్తోంది. ఒకవైపు ఒమిక్రాన్.. మరోవైపు కోవిడ్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతూపోతున్నాయి. తాజాగా రోజువారీ నమోదవుతున్న పాజిటివ్ కేసుల సంఖ్య దాదాపుగా మూడు లక్షలకు చేరువ కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.